‘వర్సిటీ’లో ఇష్టారాజ్యం..?

25 Feb, 2020 09:26 IST|Sakshi

శాతవాహన యూనివర్సిటీలో కొరవడిన ప్రత్యక్ష పర్యవేక్షణ

ఇన్‌చార్జి వీసీలపై అక్రమాల ఆరోపణలు ∙అపవాదును మూటగట్టుకుంటున్న వైనం

అక్రమాలు జరిగాయని గవర్నర్‌కు ఫిర్యాదు ∙కొనసాగుతున్న విచారణ

సాక్షి, శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్‌) : శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్‌ వైస్‌ చాన్స్‌లర్‌(వీసీ) లేక ఐదేళ్లు అవుతోంది. అప్పటి నుంచీ ఇన్‌చార్జిల పాలనే కొనసాగుతోంది. ఇతర బాధ్యతల్లో నిమగ్నమై ఉండడం, వర్సిటీకి చుట్టం చూపులాగే వచ్చిపోతుండడంతో పత్యక్ష పర్యవేక్షణ కొరవడింది. దీంతో కిందిస్థాయి అధికారులు వివిధ పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఏళ్ల తరబడిగా వస్తున్నాయి. అయినా పట్టించుకోకుండా యూనివర్సిటీకి ఇన్‌చారి్జలనే కేటాయిస్తున్నారు. ఇన్‌చార్జిల పాలన కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ పనిచేసిన రిజిస్ట్రార్లు అధ్యాపక, అధ్యాపకేతర నియమాకాల్లో, అభివృద్ధి పనుల్లో, రిజిస్ట్రార్‌గా కొనసాగడం వంటివి నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు వివిధ అంశాలకు సంబందించి శాతవాహన అధ్యాపకుల సంఘం ప్రతినిధులు, లోక్‌సత్తా పార్టీతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు వేర్వేరుగా గవర్నర్, ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు చేశారు.

దీంతో విచారణ కొనసాగుతోంది. యూనివర్సిటీలో ఏ పని జరిగినా వీసీకి తెలియకుండా  జరగదని, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నింటిలో ఇన్‌చార్జి వీసీల పాత్ర ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలు ఇన్‌చార్జి వీసీలకు తెలిసి జరిగినా, తెలియక జరిగినా ఆరోపణల అపవాదును మాత్రం మూటగట్టుకుంటన్నారని విద్యారంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటీవల రిజిస్ట్రార్‌ ఉమేష్‌కుమార్‌పై వివిధ ఆరోపణలు రావడంతో రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ టి.భరత్‌ను నియమించారు. ఆ తర్వాత ఉన్నతా విద్యామండలి ప్రత్యేక కమిటీతో ఉమేష్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై ఇద్దరితో కూడిన కమిటీతో విచారణ జరిపిస్తోంది. కమిటీ నివేదిక రాగానే సంబంధిత చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. కమిటీ నివేదిక ఏం వస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.  

పట్టించుకోని ఇన్‌చార్జిలు...
శాతవాహన యూనివర్సిటీ 2015 నుంచి ఇన్‌చార్జి పాలనలోనే కొనసాగుతుండడంతో వివిధ వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇన్‌చార్జి వీసీలు మరో ముఖ్యమైన బాధ్యతల్లో ఉండడంతో దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదని, దీంతో ఇక్కడున్న రిజిస్ట్రార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యాపక, విద్యార్థి సంఘాలు బలంగా ఆరోపిస్తున్నాయి. శాతవాహన యూనివర్సిటీలో ఐదేళ్లుగా ఇన్‌చార్జి పాలనే కొనసాగుతోంది. 19 ఏప్రిల్‌ 2012 నుంచి రెగ్యులర్‌ వీసీగా కె.వీరారెడ్డి బాధ్యతలు చేపట్టి 18 ఏప్రిల్‌ 2015 వరకు రెగ్యులర్‌ వీసీగా పనిచేశారు. ఆ తర్వాత ఆగస్టు 2015 వరకు ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తించారు. 13 ఆగస్టు 2015న ప్రస్తుత విద్యాశాఖ కార్యదర్శి, అప్పుటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి బి.జనార్దన్‌రెడ్డి ఇన్‌చారి్జగానే నియమించబడ్డారు. కానీ ఆయన మున్సిపల్‌ శాఖ బాధ్యతల్లోనే బిజీగా ఉండడం, యూనివర్సిటీకి తగిన సమయం కేటాయించలేదు. ఆయన తర్వాత హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) కమిషనర్‌ టి.చిరంజీవులును 30 ఆగస్టు 2017న నియమించింది. ఎప్పుడో ఒకసారి వస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికి ప్రతీ పనికి వర్సిటీ అధికారులు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి.  

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌చార్జిలు..
శాతవాహనలో గత కొన్నేళ్లుగా ఇన్‌చార్జి పాలన కొనసాగడంతో యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని వివిధ వర్గాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో రిజిస్ట్రార్‌ కోమల్‌రెడ్డి పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని యూనివర్సిటీ వ్యాప్తంగా చర్చ జరగడం, రాజకీయ పార్టీల నాయకులు స్వయంగా హైదరాబాద్‌లో దీనిపై సమావేశాలు ఏర్పాటు చేసి మరీ శాతవాహన అక్రమాల గురించి ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది. ఆ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారులకు సైతం పాత్ర ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం టి.చిరంజీవులు ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతున్నారు. ఇన్ని రోజులు రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఉమేష్‌కుమార్‌పై నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారని, పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలకు తెరతీశాడని, ఇష్టారాజ్యంగా అంతర్గత బదిలీలు చేశారని శాతవాహన అధ్యాపకుల సంఘం, లోక్‌సత్తా పార్టీ, వివిధ విద్యార్థి సంఘాలు గవర్నర్, ఉన్నత విద్యామండలికి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.

ఈ నెల 18న శాతవాహనలో కేయూ, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీల విశ్రాంత రిజిస్ట్రార్లు ప్రొఫెసర్‌ జగన్నాథస్వామి, ప్రొఫెసర్‌ వెంకటయ్యలతో కూడిన కమిటీ ద్వారా విచారణ జరిపించారు. దీనికి సంబంధించిన నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందనున్నట్లు తెలిసింది. కానీ ఇన్‌చార్జి వీసీ టి.చిరంజీవులుకు తెలియకుండా ఒక్క పనికూడా చేయలేదని, పై అధికారి సూచనలతోనే శాతవాహనలో పనులు చేశానని ఉమేష్‌కుమార్‌ తెలిపారు. ఒకవేళ ఉమేష్‌కుమార్‌ అక్రమాలు చేశారని తేలితే దానిలో ఇన్‌చార్జి వీసీ చిరంజీవులుకు కూడా పాత్ర ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల వివిధ అక్రమాలకు తావివ్వడం సహజమేనని ఇన్‌చార్జి వీసీకి తెలిసి జరిగినా, తెలియకుండా జరిగినా సంబంధిత అపవాదులను మూటగట్టుకోవడం తప్పదని, రెగ్యులర్‌ వీసీ ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని విద్యారంగనిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా