ప్లానింగ్ లేకుండా అభివృద్ధి పనులా?

27 Nov, 2014 03:04 IST|Sakshi

మందమర్రి : మంద మర్రి మున్సిపాలిటీ పనితీరుపై మంచిర్యాల ఆర్డీవో, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి ఆయేషా మస్రత్ ఖానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లానింగ్ లేకుండా, ఇష్టానుసారంగా పనులు చేపడుతారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆకస్మిక తనిఖీపై మందమర్రి మున్సిపాలిటీకి వచ్చిన ఆర్డీవో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు ఎలా చేపడుతున్నారనే ఆర్డీవో ప్రశ్నకు అధికారులు నీళ్లునమిలారు. ప్రభుత్వ పనులు, కార్యక్రమాలు చేపట్టే సమయంలో నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఏవైనా సిఫారసులు వస్తే వాటిని పట్టించుకోకూడదని సూచించారు.

 ఫైళ్లు ఎలా మాయమయ్యాయి?
 మున్సిపాలిటీలో గతంలో నల్లా కనెక్షన్ల కోసం ఇచ్చిన రశీదులు, దాని తాలుకూ ఫైల్ తెప్పించాలని ఆర్డీవో ఆదేశించగా ఆ ఫైల్ లేదంటూ సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీనిపై ఆగ్రహానికి గురైన ఆర్డీవో ఫైళ్లు ఎలా మాయమవుతాయని మండిపడ్డారు. ప్రజలు పన్నులు కట్టేలా చైతన్యపర్చాలని సూచించారు. మందమర్రి మార్కెట్‌లో చెత్తాచెదారం పేరుకుపోతున్నదని ఫిర్యాదులు అందుతున్నాయని, అక్కడ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీఈ గంగాధర్, ఏఈ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు