ఐటీ ఉద్యోగులకు హోం ఐసోలేషన్‌

24 Mar, 2020 04:04 IST|Sakshi

విదేశాల నుంచి వచ్చిన 1,300 మంది ఇళ్లకే పరిమితం

‘కరోనా’కనిపిస్తే క్వారంటైన్‌ సెంటర్లు, ఆసుపత్రులకు..

పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు: జయేశ్‌ రంజన్‌

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ను కట్టడి చేయ డంలో భాగంగా ఐటీ రంగ పనుల కోసం విదేశాల నుంచి వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇలా వచ్చిన 1,300 మందిని ‘సెల్ఫ్‌ ఐసోలేషన్‌’కు (స్వీయ గృహ నిర్బం«ధం) పంపించింది. రెండు రోజుల క్రితం ఇలా గుర్తించిన వారి సంఖ్య 800 వరకు ఉండగా, సోమవారం సాయంత్రానికి 1,300కు చేరింది. ఇలా గుర్తించిన వారిలో ఎన్‌ఆర్‌ఐలతో పాటు విదేశీయులు కూడా ఉన్నట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఐటీ రంగ పనులపై రాష్ట్రానికి వచ్చిన వారిని కనీసం 20 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, కరోనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులు, క్వారంటైన్‌ సెంటర్లకు తరలించేలా ఏర్పాట్లు చేశామ న్నారు. ఆన్‌సైట్‌ పనులు, క్లైంట్‌ మీటింగ్‌లు, సదస్సుల కోసం విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ఇవ్వాల్సిందిగా ఐటీ కంపెనీలను కోరినట్లు రంజన్‌ తెలిపారు.

70% ఉద్యోగులు ‘వర్క్‌ ఫ్రం హోం’
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం ఐటీ రంగానికి మినహాయింపు ఇచ్చింది. సుమారు ఐదున్నర లక్షల మంది పనిచేస్తున్న ఈ రంగం కార్యకలాపాలు దెబ్బతినకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐటీలో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నారు. చిన్న, మధ్య ఐటీ కంపెనీలు ఇంటి నుంచే పని విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. కార్యాలయాల నుంచే తప్పనిసరిగా పనిచేయాల్సిన సిబ్బందిని బృందాలుగా విభజించి, వారంలో కేవలం 2–3 రోజులే అనుమతించాలని ఐటీ సంస్థలు నిర్ణయించాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా