మంత్రి కేటీఆర్‌ పర్యటన వాయిదా!

5 Oct, 2019 10:19 IST|Sakshi

ఉప ఎన్నిక, ఆర్టీసీ సమ్మె కారణం..?

త్వరలోనే మళ్లీ పర్యటన తేదీల ప్రకటన

సాక్షి, వరంగల్‌: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పర్యటన రద్దయ్యింది. శనివారం ఆయన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌.. రెండో సారి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఐదు రోజులుగా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కేటీఆర్‌ పర్యటన సక్సెస్‌ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంతి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ బండా ప్రకాశ్, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపనేని నరేందర్, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

జిల్లా అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి మంత్రి దయాకర్‌రావు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రాంపూర్‌లో ‘కుడా’ ఆక్సిజన్‌ పార్కు, శిల్పారామం ఏర్పాటు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులు, భద్రకాళీ బండ్, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, స్మార్ట్‌ సిటీ రోడ్ల పనులను పరిశీలించారు. నగర ప్రవేశ తోరణాలు, ట్రేడ్‌ఫేర్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు, సైనిక్‌ స్కూల్, రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు తదితర అంశాలను సమీక్షించారు. అయితే హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె కారణంగా ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ పర్యటన చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే తిరిగి పర్యటన ఉంటుందని టీఆర్‌ఎస్‌ పార్టీ, అధికార వర్గాలు శుక్రవారం సాయంత్రం ప్రకటించాయి.  

మరిన్ని వార్తలు