గోల్కొండ కోటలో 'నెలవంక'

30 Nov, 2017 01:37 IST|Sakshi
తెలంగాణ ప్రభుత్వ అధికారిక విందు సందర్భంగా విద్యుత్‌ వెలుగుల్లో మెరిసిపోతున్న గోల్కొండ కోట , బుధవారం గోల్కొండ కోటలోని క్లాప్‌ పోర్టికో వద్ద చప్పట్లు కొడుతున్న ఇవాంకా ట్రంప్‌

గోల్కొండ విశేషాలు తెలుసుకొని ముగ్ధురాలైన ఇవాంకా

శత్రుదుర్భేద్య కోటలు, ప్రాకారాలు, దర్వాజాలు చూసి అబ్బురం

ఘనంగా ఆతిథ్యం.. నోరూరించిన తెలంగాణ రుచులు

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు.. మళ్లీ మళ్లీ వస్తామన్న విదేశీ అతిథులు

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా నెలవంక ఇవాంకా.. చారిత్రక గోల్కొండ కోటలో సందడి చేసింది. వైభవోపేతమైన కోట చరిత్ర తెలుసుకొని మంత్రముగ్ధురాలైంది. నాలుగు వందల ఏళ్ల నాటి భాగ్యనగర చారిత్రక విశేషాలను ఎంతో ఆసక్తిగా ఆలకించింది. హైదరాబాద్‌ నగరాన్ని స్థాపించిన కుతుబ్‌షాహీల ప్రస్థానం, శత్రుదుర్భేద్యమైన కోటలు, ప్రాకారాలు, దర్వాజాలు తదితర కట్టడాల నిర్మాణం చూసి అబ్బురపడింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండోరోజు కార్యక్రమంలో భాగంగా ఇవాంకా బుధవారం మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 3.56 వరకు సుమారు 45 నిమిషాలకు పైగా గోల్కొండ కోటలో పర్యటించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమె పర్యటన కొనసాగింది. కోట ప్రధాన ద్వారంలోకి ప్రవేశించింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు ప్రతి విషయాన్ని ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు. చప్పట్లు ప్రతిధ్వనించే క్లాప్‌పోర్టికో వద్ద చప్పట్లు తిరిగి వినిపించే తీరుపై అమితాసక్తిని ప్రదర్శించారు. కుతుబ్‌షాహీల రెండంతస్థుల ఆయాధాగారం, బ్యారక్‌లు, పచ్చటి పచ్చిక బయళ్లు, పూలతో ఎంతో అందంగా కనిపించే నగీనాబాగ్, కుతుబ్‌షాహీల అంతఃపురం రాణీమహల్, తారామతి మసీదు, రామదాసు బందీఖానా తదితర ప్రాంతాలను ఇవాంకా కాలినడనే సందర్శించారు. పర్యాటక, ఆర్కియాలజీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఆమెకు గోల్కొండ కోట విశేషాలను వివరించారు. కుతుబ్‌షాహీల చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలిపే లఘుచిత్రాన్ని ప్రదర్శించారు.

హస్తకళల ప్రదర్శన
గోల్కొండ మార్గంలో ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారయ్యే బొమ్మలు ఇవాంకాను ఆకట్టుకున్నాయి. నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక, లేపాక్షి, గోల్కొండ తదితర హస్తకళా వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాలు వంటి 12 స్టాళ్లను ఇవాంక రాక సందర్భంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించే హస్తకళల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

ఆతిథ్యం అదరహో..
ఫలక్‌నుమాలో మొఘలాయీల వంటకాలు ఆరగించిన విదేశీ అతిథులు.. బుధవారం గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ వంటకాలను రుచి చూశారు. ప్రపంచంలో మరెక్కడా లభించని అద్భుతమైన రుచులు తెలంగాణ సొంతమని పలువురు ప్రతినిధులు కితాబునిచ్చారు. తెలంగాణ ప్రజలు వండుకొనే అన్ని రకాల వంటకాలను ఈ విందులో రుచి చూపించారు. జొన్నరొట్టె, సజ్జ రొట్టె, సర్వపిండి, అంబలి, జొన్నగట్క మొదలుకొని హైదరాబాద్‌ మటన్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీ, ఎగ్‌ బిర్యానీ, ఫిష్‌ బిర్యానీ, బగారా రైస్, పులావ్, తలకాయ మాంసం, మటన్, కాళ్ల షోరువా, బోటి కూర, చికెన్‌ ఫ్రై, చికెన్‌ కర్రీ, పచ్చిపులుసు, రొయ్యల పులుసు, కోరమీను చేపల పులుసు, ఫిష్‌ ఫ్రై, బాయిల్డ్‌ ఎగ్, ఎగ్‌ కర్రీ, ఎగ్‌పులుసు, పప్పు, సాంబారు వివిధ రకాల కూరగాయలతో చేసిన నాన్‌ వెజ్‌ వెరైటీలు, సకినాలు, గర్జెలు, లడ్డూలు, గారెలు, పకోడీ, మలీద ముద్ద తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గోల్కొండ కోటలో విందు కొనసాగింది. సుమారు 1,500 మంది ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విందులో పాల్గొన్నారు. ఆర్టీసీ, పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఈ ప్రతినిధులంతా గోల్కొండ కోటకు చేరుకున్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ప్రముఖ నృత్యకారిణి డాక్టర్‌ ఆనంద శంకర్‌ జయంత్‌ నేతృత్వంలో సుమారు 200 మంది కళాకారులతో గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళలు, సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచింది. శాస్త్రీయ, జానపద, గిరిజన కళారూపాలు విదేశీ అతిథులను అబ్బురపరిచాయి. తెలంగాణ బతుకమ్మ, బోనాలు, తెలంగాణ తల్లి, రాణీ రుద్రమ తదితర నృత్య ప్రదర్శనలు, డప్పు దరువు, పేరిణీ నృత్యం, కథక్, సూఫీ తదితర నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నర్తకీమణి డాక్టర్‌ అలేఖ్య పుంజాల రాణీరుద్రమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీపికారెడ్డి తెలంగాణ తల్లి కూచిపూడి నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. మంగళ్‌భట్‌ కథక్, కళాకృష్ణ పేరిణి, స్నేహ మంగాపు భరతనాట్యం, రాఘవరాజ్‌ భట్‌ సూఫీ, షేక్‌ హనీఫ్‌ అహ్మద్‌ మార్షల్‌ ఆర్ట్స్, ప్రమోద్‌రెడ్డి రామదాసు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఈ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

మళ్లీ మళ్లీ హైదరాబాద్‌ రావాలనిపిస్తోంది
హైదరాబాద్‌ చాలా బాగుంది. గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్‌ వంటి గొప్ప కట్టడాలను చూస్తోంటే మళ్లీ మళ్లీ హైదరాబాద్‌కు రావాలనిపిస్తోంది. ఫూడ్స్‌ చాలా బాగున్నాయి. బిర్యానీ టేస్టీగా ఉంది. ఈ వంటకం తినడం ఇదే మొదటిసారి.    
–గోంజా, టాంజానియా

అతిథి మర్యాదలు బాగున్నాయి
ఆతిథ్యం చాలా బాగుంది. రకరకాల వంటలు రుచి చూశాం. హైదరాబాద్‌ ప్రజల టేస్ట్‌ తెలిసింది. మటన్, చికెన్, స్వీట్స్, ఒకటేమిటీ అన్నీ బాగున్నాయి. బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. చాలా బాగుంది. రుచికరమైన వంటల్లో హైదరాబాద్‌ చాలా ఫేమస్‌ అని తెలిసిపోయింది.  
 – మెరీనా, ఇటలీ

గ్రేట్‌ వర్క్‌ ఇవాంకా.. 
జీఈఎస్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిచ్చావ్‌ 
కుమార్తె ఇవాంకాపై ట్వీటర్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు 

వాషింగ్టన్‌:
హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌) సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలకు అద్భుతమైన ప్రోత్సాహం ఇస్తోందంటూ తన కుమార్తె, సలహాదారు ఇవాంకాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ‘గ్రేట్‌ వర్క్‌ ఇవాంకా’అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీటర్‌లో మంగళవారం అర్ధరాత్రి ట్వీట్‌ చేశారు. అమెరికన్ల కలలను నిజం చేసేలా పారిశ్రామికవేత్తల కోసం అమెరికా తీసుకుంటున్న చర్యలపై జీఈఎస్‌లో ఇవాంకా చేసిన వ్యాఖ్యలను అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. దీనిని రీట్వీట్‌ చేసిన సందర్భంగా ట్రంప్‌ పై వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ కూడా ఇవాంకాపై పొగడ్తలు కురిపించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇవాంకా భారత్‌లో పర్యటించడం ఉద్విగ్నంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలను పెట్టుబడిదారులుగా.. మెంటార్లుగా అవకాశంతో పాటు వారికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారని ఆమె మంగళవారం ట్వీట్‌ చేశారు.

వేల దిగ్గజాలు.. లక్షల ఆలోచనలు
ఉత్సాహంగా రెండోరోజు సదస్సు
సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండోరోజున విజయవంతంగా సాగింది. దాదాపు 20కు పైగా చర్చాగోష్ఠులు, సామూహిక సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తమ ఆలోచనలు పంచుకున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్లీనరీ సెషన్‌తో సదస్సు ప్రారంభమైంది. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం, పని ప్రదేశాల్లో అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు. ఇవాంకాతో పాటు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్‌ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చర్, డెల్‌ ఈఎంసీ సీసీవో కరేన్‌ క్వింటోస్‌ ఈ చర్చలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సెషన్‌ అందరినీ ఆకట్టుకుంది. తొలి ప్లీనరీకి ఇవాంకా హాజరవటంతో రెండోరోజు సదస్సు ఉత్సాహంగా ఆరంభమైంది. ఈ చర్చ ముగియగానే ఇవాంకా వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలతో గ్రూప్‌ ఫొటోలు దిగారు. అనంతరం సదస్సు నుంచి ఆమె తిరుగుపయనమయ్యారు. ఆ తర్వాత సాయంత్రం వరకు మహిళా సాధికారత, వ్యవసాయం, పెట్టుబడులు, వ్యాపార మెలకువలు, ఆరోగ్యరంగం, క్రీడలు, మీడియా వినోద రంగాలపై చర్చాగోష్ఠులు సాగాయి. 

>
మరిన్ని వార్తలు