కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదు: డిప్యూటీ సీఎం భట్టి

10 Dec, 2023 13:30 IST|Sakshi

ఖమ్మం:  కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ఖమ్మం పాత బస్టాండ్‌లో మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఉచిత టికెట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదని తెలిపారు.

ఇది ప్రజల ప్రభుత్వం, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా అన్ని హామీలను అమలు చేస్తాం, సంపాదను సృష్టిస్తాం, సంపాదను ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు. మహిళలు ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం అమలు చెయ్యలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకోచ్చని, ఎలాంటి నిర్భందాలు ఉండవని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 10కి 9 స్థానాలల్లో ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అధికారులు ప్రజల ఇంటికి వచ్చి పనులు చేస్తారని  తెలిపారు.

రెవేన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన విజయాన్ని  అందించన ప్రతి ఒక్కరికీ   ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇప్పుడు రెండు పధకాలను అమలు చేశామని తెలిపారు. మహిళ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్‌లను ప్రారంభించామని పేర్కొన్నారు.

వ్యవసాయం ,మార్కెటింగ్ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న మీ ఋణం తీర్చుకోలేమని అన్నారు. తన రాజకీయ జీవితం 40 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు అవకాశం కల్పించారని అన్నారు. గతంలో కొందరు పనికిరాని వ్యక్తుల వలన తప్పులు జరిగాయని మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు