మైనర్‌పై అత్యాచారం కేసులో జైలు

12 Jul, 2019 10:58 IST|Sakshi

ఖమ్మంలీగల్‌: మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో అశ్వారావుపేట మండలం నెమలిపేట గ్రామానికి చెందిన పాయమ్‌ వెంకన్నబాబుకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. కిడ్నాప్‌ చేసినందుకు 5 సంవత్సరాలు, రూ.5వేల జరిమానా, అత్యాచారం చేసినందుకు 10 సంవత్సరాలు జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి వి.బాలభాస్కరరావు గురువారం తీర్పుచెప్పారు. బాధితుల సమీప బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2014, జూన్‌ 3న రాత్రి సమయంలో బాధితురాలు ఇంటి ముందు పడుకుంది. అర్ధరాత్రి లేచిచూడగా.. బాధితురాలు కనపడక పోవడంతో ఫిర్యాది అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితునికి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొండపల్లి జగన్‌మోహన్‌రావు వాదించారు. కోర్టు కానిస్టేబుల్‌ బి.శ్రీనివాస్, లైజన్‌ఆఫీసర్‌ జి.ముత్తయ్య, హోంగార్డు ఎండి.అయూబ్‌ సహకరించారు.  

మరిన్ని వార్తలు