బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. సీనియర్లకు ఇద్దరు మహిళలు షాకిచ్చేనా?

19 Nov, 2023 13:52 IST|Sakshi

రాజకీయాల్లో అందలం ఎక్కడానికి సీనియర్లు.. జూనియర్లు అనే తేడా ఉండదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నవారే రాజకీయాల్లో దూసుకుపోతారు. లేదంటే ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు యువతులు సీనియర్ నేతలతో పోటీ పడుతున్నారు. యువతులిద్దరూ వేర్వేరు పార్టీలవారు. అయినా ఈసారి గెలుపు తమదే అన్నంత ధీమాగా ఉన్నారు వారిద్దరు. ఈ ఇద్దరి ప్రచారం ఆయా నియోజకవర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ఆ ఇద్దరూ ఎవరో చూద్దాం.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎదరులేని నేతగా ఎదిగారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఆయన ఇంతవరకు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓటమి చెందలేదు. తాజా ఎన్నికల్లో కూడా మరోసారి పాలకుర్తిలో కారు గుర్తుపై గెలిచేందుకు ఎర్రబెల్లి ఉధృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. నక్సలైట్ నేపథ్యం ఉన్న సీతక్క జనజీవన స్రవంతిలోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ములుగు నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకరరావు మీద కాంగ్రెస్ అభ్యర్థిగా 26 ఏళ్ళ యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ములుగులో సీతక్కకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ నుంచి నక్సల్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాగజ్యోతి అనే యువతి బరిలోకి దిగారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

ఇద్దరూ జూనియర్లే..
ములుగులో అధికార బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న బడే నాగజ్యోతి కారు గుర్తు మీద బరిలో ఉన్న అభ్యర్థులందరిలో చిన్న వయస్కురాలు. 25 సంవత్సరాలకే ములుగు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన నాగజ్యోతి.. 29 ఏళ్ళకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పొందారు. మావోయిస్టు పార్టీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాగజ్యోతి ఎమ్మెస్సీ పూర్తి చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ  సీటును ఎన్‌ఆర్‌ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆశించారు. తనకే టికెట్ అన్న భావనతో ఆమె గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అయితే భారత పౌరసత్వం పొందడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆమె కోడలైన యశస్విని రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్‌ అవకాశం ఇచ్చింది. అత్తగారికి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో బీటెక్ చదివిన యశస్విని రెడ్డి 26 ఏళ్లకే ఎమ్మెల్యే అభ్యర్థిగా జిల్లాలో సీనియర్ నేతపై పోటీ చేస్తూ..తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

గెలుపు ఎవరిది?
ఉన్నత చదువులు చదివిని ఇద్దరు యువతులు రాజకీయాల్లోకి వచ్చి చిన్న వయస్సులోనే జిల్లాలో ఉద్ధండ నేతలతో తలపడుతున్నారు. ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ఇప్పటికే రెండు సార్లు  గెలిచారు. బలమైన నేతగా ఆదివాసీల్లో గుర్తింపు పొందారు. అలాంటి సీతక్కతో అదే సామాజికవర్గానికి చెందిన బడే నాగజ్యోతి పోటీ పడుతున్నారు. ఇక పాలకుర్తిలో బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేస్తున్నారు. దయాకర్ రావు ఇప్పటికే ఒక సారి ఎంపీగా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఓటమి ఎరుగని ఎర్రబెల్లిపై యశస్విని రెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరు యువతులు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి.. తమ ప్రత్యర్థులతో పోటీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు