ఇంద్రవెల్లి ఘటనకు 38 ఏళ్లు

20 Apr, 2019 09:01 IST|Sakshi
అమరవీరుల స్తూపం

ఇంద్రవెల్లి(ఖానాపూర్‌): 1981 ఏప్రిల్‌.. 20న ‘జల్‌.. జంగల్‌.. జమీన్‌’ కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 38 ఏళ్లు. ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏప్రిల్‌ 20న ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించలేని దుస్థితి. గతం లోనైతే పోలీసుల బందూకుల నీడలో అమరుల స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత 2015 సంవత్సరం నుంచి నామమాత్రపు ఆంక్షలు విధిస్తుండడంతో ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులర్పిస్తున్నారు.

33 ఏళ్లుగా నివాళులకు దూరం
ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకు 33 ఏళ్లు అమరులకు నివాళులు అర్పించడానికి నాటి ప్రభుత్వం అనుమతిని వ్వలేదు. 20 ఏప్రిల్‌కు రెండు రోజుల ముందు నుంచే గుడిహత్నూర్, ఉట్నూర్‌ ప్రధాన రహదారిని దిగ్భందం చేయడంతోపాటు ఇంద్రవెల్లి మండల కేంద్రం పరిసరా ల్లో 19వ తేదీ ఉదయం నుంచి 25 వరకు 144 సెక్షన్‌ విధించేవారు. 2004లో అప్పటి బోథ్‌ ఎమ్మెల్యే సోయం బాపూరావ్, ఎంపీ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఏప్రిల్‌ 20కి బదులు 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు 25న వారి సంప్రదాయ ప్రకారం నివాళులర్పిస్తున్నారు. 2015న ఏప్రిల్‌లో ప్రత్యేక రాష్ట్రం లో ఆదివాసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూ పం వద్ద నివాళులర్పించడానికి రెండు గంటల సమయం ఇస్తోంది. ఈసారి కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసు భద్రతతో కూడిన అనుమ తిని ఇవ్వడంతో ఏప్రిల్‌ 20న శనివారం స్తూపాన్ని చేరు కోవడానికి ఆదివాసులు సిద్ధమయ్యారు.

అప్పుడేం జరిగిందంటే..
స్వాతంత్య్రం వచ్చి 35 ఏళ్లు దాటినా ఆదివాసీల సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు. చట్టబద్ధమైన హక్కు ల సాధన కోసం పీపుల్స్‌వార్‌ ఆధ్వర్యంలో 1981 ఏప్రిల్‌ 20న గిరిజన రైతు కులీ సంఘం పేరిట ఇంద్రవెల్లి గిరిజనులు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతివ్వకపోయిన ఆ రోజు సోమవారం వారసంత కావడం.. ఇటు సభ ఏర్పాటు చేయడంతో ఉదయం నుం చే నలువైపులా నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చా రు. మధ్యాహ్నం మూడు గంటలకే ఇంద్రవెల్లి గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభ స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గిరిజనులు వినకుండా ర్యాలీగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతోపాటు ముందున్న గిరిజన యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు.

దీంతో ఆ యువతి సదరు పోలీసుపై దాడి చేసి చంపేసింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు తూటాల వర్షం కుర్పించారు. ఈ కాల్పుల్లో కేవలం 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వం రికార్డులో ఉంది. కానీ, సుమారు 60 మంది చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. ఆదివాసీ సంఘాలు చేసిన సర్వేలో ప్రస్తుతం 20 మంది చనిపోయినట్లు ఉంది. ఈ ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య పిట్టబొంగరంను సందర్శించి బాధితులను ఆదుకుం టామని హామీ ఇచ్చిన నేటికీ నెరవేరలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు.

నేడు 144 సెక్షన్‌..
మండలంలో 19న సాయంత్రం నుంచి 20 వరకు 30 యాక్టుతోపాటు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని డీఎస్పీ డేవిడ్‌ తెలిపారు. ఆదివాసీలు ప్రశాంత వాతావరణంలో నివాళులర్పించాలనీ, తాము 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు