సర్కార్‌ చిత్రం తరహాలో చాలెంజ్‌ ఓట్లు

20 Apr, 2019 09:06 IST|Sakshi

పెరంబూరు: సర్కార్‌ చిత్రం తరహాలో లోక్‌సభ ఎన్నికల్లో చాలెంజ్‌ ఓట్లు పోలవ్వడం విశేషం. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటుడు విజయ్‌ నటించిన చిత్రం సర్కార్‌. గత ఏడాది తెరపైకి వచ్చిన ఈ చిత్రం విజయం సాధించినా, పెద్ద వివాదానికి తెరలేపింది. అందులో నటుడు విజయ్‌ విదేశం నుంచి ఓటు హక్కును వినియోగించుకోవడానికి చెన్నైకి వస్తారు. అయితే ఆయన ఓటును ఎవరో వేస్తారు. దీంతో విజయ్‌ తన ఓటు కోసం పోరాడి 49పీ చట్టం ప్రకారం ఓటు వేస్తారు.

అదే తరహాలో గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొందరి ఓట్లును వేరొకరు  వేయడంతో వారు పోరాడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలా స్థానిక చెన్నై, తాంబరం సమీపంలోని ముడిచూర్‌కు చెందిన ఒక ప్రైవేట్‌ కళాశాల అసిస్టెంట్‌ ఫ్రొపెసర్‌ గోపీనాధ్‌ ముడిచూర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయడానికి వెళ్లారు. అప్పటికే ఆయన ఓటును వేరెవరో వేశారు. దీంతో ఆయన ఎన్నికల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు సర్కార్‌ చిత్రంలో మాదిరిగా 49పీ చట్టం ప్రకారం 17పీ ఫారం ద్వారా ఓటు వేశారు. అదే విధంగా అదే ప్రాంతానికి చెందిన రాజాజీ, కడలూరు జిల్లా, చిదంబరం ప్రాంతానికి చెందిన పరువ తరాజ్‌ అనే వ్యక్తి, కుమరి జిల్లా, పద్మనాభపురానికి చెందిన అజిన్, షాజీరాజేశ్‌ అనే వ్యక్తులు చాలెంజ్‌ ఓట్లను వేశారు. నెల్‌లై జిల్లాలోని నెల్‌లై పేట, కేఓపీ వీధికి చెందిన జాబర్‌సాధిక్, ఆయన భార్య ఆయిషా సిద్ధిక 49పీ చట్టం ప్రకారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా మరి కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు నకిలీ ఓట్లకు గురైన వారికి చాలెంజ్‌ ఓట్లకు అవకాశం కల్పించారు. ఇలా విజయ్‌ నటించిన సర్కార్‌ చిత్రం వారికి స్ఫూర్తిగా నిలిచిందన్నమాట.

మరిన్ని వార్తలు