బ్లడ్‌ బ్యాంకుకు మహర్దశ 

20 Jan, 2018 17:42 IST|Sakshi

ఎన్‌ఏబీహెచ్‌కు జనగామ ఏరియా ఆస్పత్రి ఎంపిక

రాష్ట్రంలో రెండింటిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం

కార్పొరేట్‌కు దీటుగా రక్తనిధి కేంద్రం అభివృద్ధి

జనగామ: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లోని రక్తనిధి కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఖమ్మంతో పాటు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని పైలట్‌ ప్రాజెక్టు కింద నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌)కు ఎంపిక చేశారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల నిర్వహణ రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి వెళ్లి పోయింది. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు  ఎన్‌ఏబీహెచ్‌కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం జనగామ ఏరియా ఆస్పత్రిలో 1000 యూనిట్లు సామర్థ్యం ఉన్న రక్తనిధి కేంద్రం పనిచేస్తోంది. ఎన్‌ఏబీహెచ్‌కు పూర్తి అర్హత సాధించేందుకు ఇక్కడి రక్తనిధి కేంద్రంలో పనిచేస్తున్న మెడికల్‌ ఆఫీసర్, ఇతర సిబ్బంది కృషి చేస్తున్నారు. 

అర్హత సాధించాలంటే..
ఆదర్శవంతమైన రక్తనిధి కేంద్రంగా ఏరియా ఆస్పత్రి గుర్తింపు పొందాలంటే కేంద్రం ప్రభుత్వం విధించిన గైడ్‌లైన్స్‌ తప్పనిసరి. 24 గంటలపాటు ఎయిర్‌ కండీషన్, యంత్రాల పనితీరు, మెడికల్‌ ఆఫీసర్, ఐదుగురు టెక్నీషియన్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక కౌన్సిలర్, రెండు కంప్యూటర్లు, రెండు టెలివిజన్లు, ప్రింటర్లు, ఒక అంబులెన్స్‌ ఉండాలి. ఇందులో ఒకస్టాఫ్‌ నర్సు కొరత ఉండగా, కంప్యూటర్లు, టెలివిజన్లు, అంబులెన్స్‌ అసలు లేవు. ఎన్‌ఏబీహెచ్‌కు పోటీ పడాలంటే రక్తనిధి కేంద్రంలో స్టాండర్డు క్వాలిటీ ఉండాలి. పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో వసతి సౌకర్యాలను జిల్లా, రాష్ట్ర స్థాయి టీంలు పరిశీలిస్తాయి. అనంతరం కేంద్ర బృందం పరిశీలించిన తర్వాతనే అర్హత సర్టిఫికెట్‌ను అందజేస్తారు. 

రాష్ట్ర బృందం పరిశీలన
ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని ఇటీవల స్టేట్‌ క్వాలిటీ ఆఫీసర్‌ నిరంజన్‌ పరిశీలించారు. రక్తనిధి నిల్వల సామర్థ్యం, రికార్డులు, పని తీరుపై మెడికల ఆఫీసర్‌ రాంనర్సయ్య, పీఆర్వో రాము, రజిని, రాజేశ్వర్, వెంటస్వామిని అడిగి తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు