మే జీతం ఆ నెల 24నే

8 Apr, 2014 04:05 IST|Sakshi

25వ తేదీ నుంచి   అన్ని రకాల చెల్లింపులు బంద్
 మే నెలాఖరులోగా ఉమ్మడి రాష్ట్ర ఖాతాల ముగింపు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో మే నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపును మే 24వ తేదీనే చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా అయితే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ చెల్లింపులు ప్రతి నెల 1వ తేదీన చేస్తారు. అయితే జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం రెండుగా విడిపోతున్న నేపథ్యంలో మే నెలాఖరులోగా ఉమ్మడి రాష్ట్రం అకౌంట్లను మూసివేయూల్సి ఉంది. ఈ నేపథ్యంలో అకౌంటెంట్ జనరల్, ఆర్థిక శాఖ కలిసి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులను మే 24వ తేదీనే చేయాలని నిర్ణయించారు. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల బిల్లులను కూడా మే 24వ తేదీలోగా చెల్లించేయాలని నిర్ణయించారు.  24వ తేదీ తరువాత ఎటువంటి బిల్లులు పరిశీలనలో ఉండకూడదని, చెల్లింపులు చేయడమో లేదా తిరస్కరించడమో 24వ తేదీతో ముగిసిపోవాలని మెమోలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 25వ తేదీ నుంచి ఉమ్మడి రాష్ట్రం ఖజానా నుంచి ఎటువంటి చెల్లింపులను చేయరు.
 
 ఆ తేదీ నుంచి మే 31వ తేదీకల్లా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని రకాల అకౌంట్ల లావాదేవీలను సరిచూసి అకౌంటెంట్ జనరల్ ముగింపునిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే చెక్కులు కూడా మే 31వ తేదీలోగానే చెల్లుతాయని పేర్కొంటూ మరో మెమో జారీ చేశారు. మే నెలలో ముందుస్తు కేటాయింపులు లేకుండా అత్యవసర బిల్లులకు ఎటువంటి చెల్లింపులు చేయరాదని ఆర్థిక శాఖ పేర్కొంది. జూన్ 2వ తేదీ అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటవుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ  అకౌంట్, ఖజానా వేర్వేరుగా పనిచేయడం ప్రారంభమవుతాయి.

మరిన్ని వార్తలు