‘సమత’ హత్యాచార కేసులో ప్రత్యేక కోర్టు

12 Dec, 2019 03:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో హత్యాచారానికి గురైన ‘సమత’కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి పేరిట జీవో జారీ అయింది. ఐదవ అదనపు సెషన్స్, ఆదిలాబాద్‌ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమత కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఈ నెల 9న ప్రభుత్వం హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ ఆమోదం తెలిపారు. కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పీఎస్‌ లింగాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సమత అనే ఆదివాసీ యువతిని షేక్‌బాబు, షేక్‌ షాబుద్దీన్, మక్లూ హత్యాచారం చేశారని కేసు నమోదైన విషయం తెలిసిందే.

త్వరగా శిక్ష పడేలా చర్యలు: ఇంద్రకరణ్‌ 
సమత కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అటవీ, న్యాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు