జానా, షబ్బీర్లతో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ

23 Jun, 2016 03:16 IST|Sakshi
జానా, షబ్బీర్లతో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ

రాష్ట్ర ఏర్పాటు, అనంతర పరిణామాలపై చర్చ
రాజకీయ అవసరాల కోసం జిల్లాలు వద్దు: జానా

సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీలతో బ్రిటిష్ హైకమిషనర్ సర్ డొమినిక్ యాష్‌క్విత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుధవారం అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, వంశీ చంద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, ప్రజల కోరికకు కారణాలు, రాష్ట్ర ఏర్పాటు అనంతర పరిణామాలపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడం వల్లే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని బ్రిటిష్ ప్రతినిధులకు జానా, షబ్బీర్ వివరించారు. భేటీ అనంతరం వివరాలను జానారెడ్డి మీడియాకు వెల్లడించారు.

బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగడంపై ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. బ్రిటన్ ఈయూలో ఉండాలా వద్దా అని బ్రిటిష్ ప్రతినిధులు తమను అడిగారని, ఈయూ లో ఉండాలని తాము చెప్పామన్నారు. ఇక కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరిగే యువజన కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియను బ్రిటిష్ ప్రతినిధులు ఆసక్తిగా తెలుసుకున్నారని చెప్పారు. బ్రిటిష్ వారు తమను సలహా అడిగారని.. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాలు ఏర్పాటు చేస్తే మంచిదని, రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. జిల్లాల ఏర్పాటులో ప్రజల సెంటిమెంటు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.  యాదగిరిగుట్టను జిల్లాగా చేయాలని కోరారు. బయ్యారం గనుల కోసమే ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలో బయ్యా రం, గార్ల మండలాలను కలిపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గెలిపిస్తే ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని అడిగారు.

న్యాయవాదుల అరెస్టు సరికాదు: పొన్నం
న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులను అరెస్టు చేయడాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో ఖండించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన  న్యాయవాదులను అరెస్టు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సిగ్గుచేటని విమర్శించారు. న్యాయవాదులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మిక సంఘాలను అణచివేస్తే కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుం దని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు