సాగునీటి రంగంలో అతిపెద్ద మోటార్‌

21 Jul, 2018 20:57 IST|Sakshi
హరీష్‌ రావు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటి పంప్‌ మోటర్‌ను ప్రాజెక్టు అధికారులు డ్రై రన్‌ను నిర్వహించారు. దీనిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. 139 మెగావాట్ల సామర్థ్యంతో ఈ మోటారు ప్రపంచ సాగునీటి రంగంలోనే అతి పెద్దదని తెలిపారు. భూగర్భంలో 340x25x65.5 డైమన్షన్లతో ఈ మోటర్‌ను బిగించినట్లు మంత్రి తెలిపారు. మోటారు గరిష్టంగా 214 ఆర్‌.పీ.ఎం స్వీడ్‌తో నడుస్తుందని, ఇవాల్టీ డ్రై రన్‌లో మోటర్‌ పూర్తి సామర్థ్యంలో పనిచేసిందని ‍వెల్లడించారు.

సమావేశంలో హరిష్‌ రావు మాట్లాడుతూ.. ‘రేయింబవళ్లు పనిచేసి డ్రై రన్‌ విజయవంతం చేసిన ఇంజనీర్లకు, కార్మికులకు అభినందనలు. కాళేశ్వరం ప్రాజెక్టులో 19 పంపు హౌసుల్లో మొత్తం 86 మోటర్లు పెడుతున్నాం. వాటిలో మొదటి మోటార్‌ ఇవాళ సక్సెస్‌ అయ్యింది. ఎనిమిదో ప్యాకేజీ పంప్‌ హౌస్‌లో మొత్తం ఏడు మోటార్లుంటాయి. ఇవి రోజుకు రెండు టీఎంసీల నీటిని లిప్ట్‌ చేస్తాయి. లిప్ట్‌ కోసం అవసరమైన కరెంట్‌ కోరకు 18 సబ్‌ స్టేషన్ల్‌ నిర్మాణం జరుగుతోంది. లక్ష్మిపూర్‌లో 400 కె.వి సబ్‌  స్టేషన్‌ పూర్తి కావడంతో అదే కరెంట్‌తో ఇవాల్టి మోటార్‌ డ్రై రన్‌ చేశాం. ఎనిమిదో ప్యాకేజీలో మోటార్లన్నీ సెప్టెంబర్‌ నాటికి పూర్తవుతాయి. మేడారం దగ్గర ఆరో ప్యాకేజీకి సంబంధించి గ్యాస్‌ బెస్ట్‌ 400 కె.వి పవర్‌ స్టేషన్‌ ఈ నెల 25లోగా పూర్తవుతాయి. ఇది ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్‌ ఆధారిత సబ్‌ స్టేషన్‌. ఆరో ప్యాకేజీ సబ్‌ స్టేషన్‌ పూర్తయితే ఆగస్ట్‌ రెండో వారంలో ఇక్కడి మోటర్లు డ్రై రన్‌ కూడా చేస్తాం.

6,8 ప్యాకేజీల మధ్యన ఏడో ప్యాకేజీకి సంబంధించిన 50 కిలో ట్విన్‌ టన్నెల్‌ డ్రిల్లింగ్‌ పనుల్లో ఇప్పటికే 49.988 కి.మీ పూర్తయింది. కేవలం 12 మీటర్లు టన్నెల్‌ డ్రిల్లింగ్‌ మాత్రమే ఉన్నప్పటికి లూజ్‌ సాయిల్‌ వల్ల జాగ్రత్తగా పనులు చేయాల్సి వస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన టన్నెల్‌ ఇంజనీర్‌ నిపుణుడైన విక్రం సింగ్‌ చౌహన్‌ పర్యవేక్షణలో రేయింబవళ్లు పనులు జరుగుతున్నాయి. మరో  10 రోజుల్లో మిగిలిన 12 మీటర్ల టన్నెల్‌ డ్రిల్లింగ్‌ పూర్తి చేసి.. ఆ తరువాత లైనింగ్‌ పనులు చేపడుతాం. 6,7,8 ప్యాకేజీలు ఆక్టోబరు నాటికి అందుబాటులోకి వస్తే.. ఎల్లంపల్లి నీటిని మిడ్‌ మానేర్‌కు తరలిస్తాం’ అని వెల్లడించారు.

మరిన్ని వార్తలు