తరలివచ్చిన జలతరంగిణి

21 Feb, 2020 03:34 IST|Sakshi

ఎస్సారెస్పీ పూర్తిస్థాయి ఆయకట్టుకు యాసంగిలో అందుతున్న సాగునీరు

ఇప్పటికే సూర్యాపేట జిల్లా వరకు చేరిన గోదావరి జలాలు

69 టీఎంసీల వినియోగం.. 12 లక్షల ఎకరాలకు నీరు

మార్చి వరకు మరో 20–25 టీఎంసీల మేర వినియోగం

పునరుజ్జీవన పథకం ద్వారా వరద కాల్వకు సైతం అందుబాటులో నీరు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలతో పెరిగిన నీటి లభ్యత, ఎగువ కాళేశ్వరం ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలతో శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు పరీవాహకం ఉప్పొంగుతోంది. గత యాసంగి సీజన్లకు భిన్నంగా ఈ ఏడాది ఎస్సారెస్పీ–1, 2 కింద పూర్తి ఆయకట్టుకు నీరందించడంతో పాటు గరిష్టంగా 65 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. మరో 20 నుంచి 25 టీఎంసీల నీటిని మార్చి చివరి వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో రైతులకు ఉపశమనం కలుగుతోంది. కొత్తగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది చెరువులు నింపుతూ, ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియ మొదలవడంతో జోష్‌ మరింత పెరిగింది.

చరిత్రలో తొలిసారి..
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్టేజ్‌–1 కింద 9.6 లక్షలు, స్టేజ్‌–2 కింద 3.97 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు గతేడాది వర్షాకాల సీజన్‌లో కురిసిన వర్షాలతో 159 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. ఇందులోంచి ఖరీఫ్‌లో నీటి వినియోగం పెద్దగా చేయలేదు. దీంతో యాసంగి మొదలయ్యే నాటికి ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను.. 89 టీఎంసీల మేర లభ్యత ఉండటంతో స్టేజ్‌–1 కింద లోయర్‌ మానేరు డ్యామ్‌ (ఎల్‌ఎండీ) వరకున్న 4.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి గతేడాది డిసెంబర్‌ 25 నుంచి నిరంతరాయంగా నీటిని 4 తడుల ద్వారా విడుదల చేసి సాగునీరిచ్చారు. దీనికే ఇప్పటి వరకు 25 టీఎంసీల మేర నీటి వినియోగం చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు 58 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. లభ్యత నీటిలోంచి మరో 3 తడుల ద్వారా 20–25 టీఎంసీల మేర నీరిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఎల్‌ఎండీ దిగువన స్టేజ్‌–1 కిందే ఉన్న మరో 5లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎల్‌ఎండీకి ఎత్తిపోసిన నీటితో సాగునీరిచ్చారు. స్టేజ్‌–1 కిందే మొత్తంగా 9.5 లక్షల వరకు ప్రస్తుతం సాగునీరందింది. ఇక స్టేజ్‌–2 కింద 3.97లక్షల ఎకరాలకు గానూ 2.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. దీంతోపాటే 592 చెరువులను నింపుతున్నారు. ఎల్‌ఎండీ దిగువన మొత్తం 44 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. టెయిల్‌ టు హెడ్‌ అనే పద్ధతిన నీరు పంపిణీ చేయడంతో ఆయకట్టు చివరి జిల్లా అయిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలానికి గోదావరి నీళ్లు చేరాయి. మొత్తంగా ఎస్సారెస్పీ కింద చరిత్రలో తొలిసారి 12 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 69 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. గడిచిన పదేళ్లలో యాసంగిలో జరిగిన వినియోగాన్ని పరిశీలిస్తే గరిష్టంగా 2010–11 ఏడాదుల్లో 57.96 టీఎంసీలుగా మాత్రమే ఉంది. కానీ ఇప్పటికే 69 టీఎంసీల మేర వినియోగం పూర్తవ్వడం, మరింత నీటి వినియోగానికి సిద్ధంగా ఉండటంతో మార్చి చివరికి 100 టీఎంసీల మార్కును దాటే అవకాశాలున్నాయి.

పునరుజ్జీవంతో మరింత మేలు..
ఎస్సారెస్పీపైనే ఆధారపడిన వరద కాల్వకు సైతం పునరుజ్జీవ పథకం ద్వారా నీరందిస్తున్నారు. పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉన్న రాంపూర్, రాజేశ్వరరావుపేటలోని మోటార్లను ఆరంభించి కాల్వకు నీటిని విడుదల చేశారు. ఒక టీఎంసీ నీటిని పంపింగ్‌ చేసి 50 చెరువులను నింపనున్నారు. దీంతో పాటే వరద కాల్వ పరిధిలో బోరు మోటార్ల ద్వారా సాగు చేసిన ఆయకట్టుకు నీటి లభ్యత పెంచనున్నారు. ఎస్సారెస్పీలో ఏప్రిల్‌ నాటికి యాసంగి వినియోగంతో లభ్యత పడిపోగానే ఇదే ఎగువ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేసి పునరుజ్జీవన పథకం ద్వారా మళ్లీ నింపనున్నారు. దీంతో మళ్లీ ఖరీఫ్‌లో సాగుకు నీటి కొరత లేకుండా చూసేలా ఇదివరకే ప్రణాళిక రచించారు. 

గత పదేళ్లలో ఎస్సారెస్పీకి వచ్చిన వరద నీరు, వినియోగం.. (టీఎంసీల్లో)
సంవత్సరం    వచ్చిన వరద    నీటి వినియోగం

2009–10       27.34          13.61
2010–11      308.82         57.96
2011–12      174.20        33.67
2012–13       54.73         27.38    
2013–14       320           56.60    
2014–15      14.77         4.11
2015–16      4.42          1.61
2016–17      356.26       43.47
2017–18      75.31         33.42
2018–19      77.17       17.10
2019–20      159             69 

 

మరిన్ని వార్తలు