కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌.. రంగంలోకి ఏఐసీసీ పెద్దలు!

15 Nov, 2023 11:32 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. దీంతో​, నామినేషన్లు వేసిన వారిపై ప్రధాన పార్టీల నేతలు ఫోకస్‌ పెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో రెబల్స్‌ నేతలు అభ్యర్థులను టెన్షన్‌ పెడుతున్నారు. దీంతో, కాంగ్రెస్‌ పెద్దలు రంగంలోకి రెబల్స్‌ను బుజ్జగిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పెద్దలు.. సూర్యాపేటలో రెబల్‌ అభ్యర్థి పటేల్‌ రమేష్‌ రెడ్డిని కలిశారు. 

వివరాల ప్రకారం.. సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ పెద్దలు వెళ్లారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో తాను వేసిన నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని వారు సూచించారు. ఇదే సమయంలో సూర్యాపేట కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌ రెడ్డికి మద్దతు ఇవ్వాలని రమేష్‌ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏఐసీసీ పెద్దలను చూడగానే రమేష్‌ రెడ్డి మరోసారి బోరున విలపించారు. వారితో తన ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి కూడా తనకు టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. 

తగ్గేదేలే..
ఇక, కాంగ్రెస్‌ పెద్దల బుజ్జగింపులను రమేష్‌ రెడ్డి పట్టించుకోలేదు. రమేష్‌ రెడ్డి వెనక్కి తగ్గలేదు. రమేష్‌ ఇంటికి వెళ్లిన వారిలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్  చౌదరీ, మల్లు రవి ఉన్నారు. మరోవైపు.. పటేల్‌ మద్దతుదారులు రోహిత్‌ చౌదరీ, మల్లు రవిని అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా రోడ్డుపై బెఠాయించి నిరసనలు తెలిపారు. 

తెలంగాణలో ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నేతలు టికెట్లు ఆశించగా, అందులో టికెట్లు రాని అసంతృప్తులు రాష్ట్రవ్యాప్తంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 24 మందిని కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కనీసం 10 చోట్ల ఆ పార్టీకి రె‘బెల్స్‌’మోగక తప్పదని గాంధీ భవన్‌ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, బాన్సువాడ, వరంగల్‌ వెస్ట్, డోర్నకల్, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. 

రెబల్‌ అభ్యర్థులు వీరే..
ఈసారి కాంగ్రెస్‌ రెబెల్స్‌గా జంగా రాఘవరెడ్డి (వరంగల్‌ వెస్ట్‌), నరేశ్‌ జాదవ్‌ (బోథ్‌), గాలి అనిల్‌కుమార్‌ (నర్సాపూర్‌), ఎస్‌.గంగారాం (జుక్కల్‌), కాసుల బాలరాజు (బాన్సువాడ), నాగి శేఖర్‌ (చొప్పదండి), దైద రవీందర్‌ (నకిరేకల్‌), రామ్మూర్తి నాయక్‌ (వైరా), ప్రవీణ్‌ నాయక్, చీమల వెంకటేశ్వర్లు (ఇల్లందు), విజయ్‌కుమార్‌రెడ్డి (ముథోల్‌), లక్ష్మీనారాయణ నాయక్‌ (పాలకుర్తి), సున్నం వసంత (చేవెళ్ల), నెహ్రూ నాయక్‌ (డోర్నకల్‌), భూక్యా మంగీలాల్‌ (మహబూబాబాద్‌), పటేల్‌ రమేశ్‌రెడ్డి (సూర్యాపేట), చిమ్మని దేవరాజు (పరకాల), సిరిసిల్ల రాజయ్య (వర్ధన్నపేట)తోపాటు మరికొంత మంది రంగంలోకి దిగారు.

మరిన్ని వార్తలు