రూ.11,081 కోట్లతో ‘కాళేశ్వరం’

12 Nov, 2016 02:03 IST|Sakshi
రూ.11,081 కోట్లతో ‘కాళేశ్వరం’

ఆర్థిక శాఖకు తుది ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: అనేక తర్జనభర్జనలు, మార్పులుచేర్పుల అనంతరం కాళేశ్వరంలోని ప్రధాన రిజర్వాయర్ల తుది అంచనాలు సిద్ధమయ్యాయి. రూ.11,081 కోట్లతో ఐదు రిజర్వాయర్ల అంచనాలు ఆర్థిక శాఖకు చేరాయి. ఇక్కడ పరిశీలన అనం తరం వచ్చే వారం పరిపాలన అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయకసాగర్‌ను 3 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించనుండగా, దీనికి రూ. 550 కోట్ల వ్యయం అవుతుందని తేల్చారు. ఇక 50 టీఎంసీల మల్లన్నసాగర్‌కు రూ.7,308 కోట్లు, 7 టీఎంసీల కొండపోచమ్మకు రూ.521.50 కోట్లు, 9.86 టీఎంసీల గంధమలు రూ.898.50 కోట్లు, 11.39 టీఎంసీల రూ.1803 కోట్లతో తుది వ్యయ అంచనాలు సిద్ధమయ్యాయి. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వాడుకలోకి తెచ్చే కసరత్తులో భాగంగా.. మరో 32 టీఎంసీల నీటి వినియోగానికి కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలత తెలిపింది.

వరంగల్ జిల్లాలో 10.08 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 32 టీఎంసీ గోదావరి జలాలను కాకతీయ కాల్వకు తరలించేలా పత్తిపాక వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేయాలని వచ్చిన సూచనను సీఎం కేసీఆర్ ఓకే చెప్పినట్లుగా సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ డిజైన్ ప్రకారం, ఎల్లంపల్లికి చేరే గోదావరి జలాలను జంట టన్నెళ్ల ద్వారా మేడారం రిజర్వాయర్‌కు తరలించేలా డిజైన్ చేశారు. మేడారం నుంచి కాకతీయ కాల్వతోపాటు ఎస్సారెస్పీ వరద కాలువలోకి గోదావరి జలాల్ని తీసుకెళ్లి.. మిడ్ మానేరు రిజర్వాయర్‌కు నీటిని తరలించాలని తొలి ప్రతిపాదన ఉండగా, దీనిలో ప్రస్తుతం మార్పులు చేశారు.

మేడారం నుంచి నేరుగా కాకతీయ కాల్వలోకి నీటిని తరలించకుండా మధ్యలో పత్తిపాక వద్ద 10.08 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రతిపాదించినట్లుగా తెలిసింది. 352 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉండే ఈ రిజర్వాయర్‌తో గ్రావిటీ ద్వారా కాకతీయ కెనాల్‌కు నీటిని తరలించవచ్చని, దీని నిర్మాణానికి రూ.3 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు.

మరిన్ని వార్తలు