521 గ్రామాల్లో కంటి వెలుగు పూర్తి 

26 Aug, 2018 01:02 IST|Sakshi

7.16 లక్షల మందికి పరీక్షల నిర్వహణ

పట్టణాలకంటే పల్లెల్లోనే భారీ స్పందన.... పేదలే అధికం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం 521 గ్రామాల్లో పూర్తయింది. 7.16 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3.07 లక్షల మంది పురుషులు కాగా, 4.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళలే లక్ష మంది అధికంగా కంటిపరీక్షలు చేయించుకోవడం గమనార్హం. మొత్తం జనాభాలో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఇప్పటి వరకు ఓసీలు 72 వేల మంది, బీసీలు 4.06 లక్షల మంది, ఎస్సీలు 1.41 లక్షల మంది, ఎస్టీలు 55 వేల మంది, మైనారిటీలు 40 వేల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.

పరీక్షలు చేయించుకున్న వారిలో 1.33 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులను అందజేశారు. అంతేకాకుండా చత్వారం కారణంగా ఇతర కంటి అద్దాల కోసం ప్రిస్కిప్షన్‌ రాయించుకున్న వారు 1.91 లక్షల మంది, కేటరాక్ట్‌కు గురైనవారు 84 వేల మంది ఉన్నారు. తదనంతర వైద్యం అవసరమైనవారు 2.22 లక్షల మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తం వచ్చినవారిలో 2.19 లక్షల మందికి ఎటువంటి కంటి సమస్య లేనట్లుగా నిర్ధారించారు. పట్టణాల్లోకంటే పల్లెల్లోనే కంటి పరీక్షలకు భారీ ఎత్తున స్పందన వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాదు వచ్చేవారిలో 40 ఏళ్లు పైబడిన వారే అధికంగా ఉంటున్నారు. అలాగే పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలే కంటి వెలుగు శిబిరాల వద్ద బారులు తీరుతున్నారు. 

మరిన్ని వార్తలు