బిరబిరా కృష్ణమ్మ

5 May, 2019 01:04 IST|Sakshi

ఆల్మట్టి నుంచి జూరాలకు నీటి విడుదల 

5,800 క్యూసెక్కులు విడుదల చేసిన కర్ణాటక 

నేడు నారాయణపూర్‌కు.. అక్కడి నుంచి జూరాలకు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న చొరవ కార్యరూపం దాల్చింది. ఎగువన ఉన్న నారాయణపూర్‌ నుంచి దిగువన ఉన్న జూరాలకు కర్ణాటక జల వనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నారాయణపూర్‌ డ్యామ్‌లో సరి పడినంత నీటి లభ్యత లేకపోవడంతో ఆల్మట్టి నుంచి శుక్రవారం అర్ధరాత్రి నారాయణపూర్‌కు నీరు విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి విడుదలైన నీరు ఆదివారం నారాయణపూర్‌కు చేరిన తర్వాత.. అక్కడి నుంచి జూరాలకు నీటి విడుదల ప్రక్రియ కొనసాగనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం కోరడం, దానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే.

అయితే నారాయణపూర్‌ సామర్థ్యం 37.64టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18.08 టీఎంసీల నీరుమాత్రమే ఉంది. నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరడంతో దిగువకు నీటి విడుదల సాధ్యం కాదు. దీంతో ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు నీటి విడుదల తప్పనిసరయింది. ఆల్మట్టిలోనూ 129.72 టీఎంసీల నిల్వలకు గానూ 30.38 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడ డెడ్‌స్టోరేజీకి ఎగువన కేవలం 12 టీఎంసీల నిల్వలే ఉన్నప్పటికీ తెలంగాణ అవసరాల దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి డ్యామ్‌ స్పిల్‌వే ద్వారా 5,161 క్యూసెక్కులు, పవర్‌హౌజ్‌ ద్వారా మరో 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఆదివారం ఉదయం నారాయణపూర్‌కు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌లో కొద్దిగా నిల్వలు పెరిగిన వెంటనే స్పిల్‌వే ద్వారా జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నారాయణపూర్‌ నుంచి జూరాలకు 180 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో కర్ణాటకలోని గూగల్, గిరిజాపూర్‌ అనే చిన్నపాటి రిజర్వాయర్లను దాటుకొని నీరు జూరాలకు చేరాల్సి ఉంటుంది. ఇలా జూరాలకు నీరు చేరేందుకు వారం రోజులు పట్టనుండగా, కనీసం ఒక టీఎంసీ నీరు జూరాలకు చేరే అవకాశం ఉంటుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఈ నీటితో జూన్‌ రెండో వారం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మిషన్‌ భగీరథ కింద తాగునీటి అవసరాలకు సర్దుబాటు చేయవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.   

మరిన్ని వార్తలు