కాళేశ్వరంలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

19 May, 2019 09:08 IST|Sakshi

సాక్షి, జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం కాళేశ్వరం చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందజేసి శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కేసీఆర్‌ తిరిగి కన్నెపల్లికి చేరుకుని అక్కడినుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తారు. మధ్యాహ్నం 1.30 వరకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనుల పరిశీలన, ప్రగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. అక్కడినుంచి రామగుండంలో మధ్యాహ్న భోజనం, విరామం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరతారు.

కాగా, శనివారం రోజున పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్‌ కర్మాగారాన్ని పరిశీలించిన కేసీఆర్‌ రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో కన్నెపల్లి చేరుకున్న కేసీఆర్‌ అక్కడి నుంచి కాళేశ్వరానికి వచ్చారు. 

మరిన్ని వార్తలు