కట్టలు, కాల్వలకు పునరుజ్జీవం 

19 Jun, 2020 04:07 IST|Sakshi

రూ.1,200 కోట్ల ఉపాధి నిధులు కేటాయింపు 

చెరువులు, ప్రాజెక్టుల కింది కాల్వలు, కట్టల పునరుద్ధరణ 

30 వేల చెరువుల కోసం రూ.500 కోట్లు 

రూ.700 కోట్లతో ప్రాజెక్టుల పరిధిలో కాల్వల పునరుద్ధరణ 

పకడ్బందీగా పనులు చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన గ్రామీణ కూలీలకు పనుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లోని కాల్వలు, కట్టల పునరుద్ధరణకు బృహత్‌ కార్యాచరణ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉపాధి హామీ పథకాన్ని నీటిపారుదల శాఖకు అనుసంధానించి రూ.1,200 కోట్ల మేర పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. వర్షాలు, నీటి లభ్యత పుష్కలంగా ఉండనున్న దృష్ట్యా చెరువులు, ప్రాజెక్టుల పరిధిలోని కట్టలు, కాల్వలు, ఫీడర్‌ చానళ్ల అభివృద్ధి.. చెట్లు, పొదల తొలగింపును పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  

‘ఉపాధి’తో అభివృద్ధి..
లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కూలీలంతా సొంత గ్రామాలకు తరలిపోయిన విషయం తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీలంతా కష్టంగా నెట్టుకొస్తున్న నేపథ్యంలో కూలీలకు పని కల్పన లక్ష్యంగా కేంద్రం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనుల కింద భారీగా నిధుల కేటాయింపులు జరిపి, గ్రామీణ స్థాయిలో 260 రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఇచ్చింది. ఈ పనుల్లో నీటి పారుదల రంగానికి సంబంధించిన పనులే 23దాకా ఉన్నాయి. ప్రధానంగా చెరువుల పూడికతీత, కాల్వలు, కట్టలు, ఫీడర్‌ చానళ్లలో పూడికతీత, చెట్లు, పొదల తొలగింపు, కాల్వలు, పిల్ల కాల్వల లైనింగ్‌ పనులు, ప్రధాన ప్రాజెక్టుల్లోనూ కాల్వల పునరుద్ధరణ పనులకు అనుమతించింది. ఇందులో భాగంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని చెరో 15వేల చెరువులు కలిపి 30 వేల చెరువుల కింద కట్ట, కాల్వలు, ఫీడర్‌ చానళ్ల పునరుద్ధరణకు రూ.500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది.

ఈ పనులతో 30 వేల చెరువుల పరిధిలోని కాల్వల్లో కోటి క్యూబిక్‌ మీటర్ల పూడికతీత తీయనున్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, నాగార్జునసాగర్, దేవాదుల, కల్వకుర్తి, బీమా, జూరాల వంటి భారీ ప్రాజెక్టులతో పాటు పోచారం, ఘణపురం, శనిగరం, సాత్నాల, వైరా, ర్యాలివాగు, గొల్లవాగు, పెద్దవాగు వంటి సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోనూ ప్రధాన, బ్రాంచ్‌ కాల్వల మరమ్మతుల నులను రూ.700 కోట్లతో చేపట్టనున్నారు.  

మరిన్ని వార్తలు