అత్యాశతో కిడ్నాప్..హత్య

2 Aug, 2014 01:18 IST|Sakshi
అత్యాశతో కిడ్నాప్..హత్య

వీడిన అరుణ్‌కుమార్ మర్డర్ కేసు మిస్టరీ

నిందితుడి అరెస్టు

చందానగర్: గతనెల 23న ద్వారకా టిఫిన్ సెంటర్ సమీపంలో అనుమానాస్పద స్థితి జరిగిన కాపారపు అరుణ్‌కుమార్ హత్య కేసు మిస్టరీని చందానగర్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చందానగర్ డీఐ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన గండి నవీన్ (26) ఎంబీఏ పూర్తి చేశాడు. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రూ.2 లక్షలు నష్టపోయాడు. తర్వాత తండ్రి రూ. 20 లక్షలు అప్పు చేసి ఇవ్వగా.. రైస్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ ప్రారంభించాడు.

ఈ వ్యాపారంలో లాభాలు రావడంలేదు. దీనికి  తోడు చేసిన అప్పుకు ప్రతి నెల రూ. 40 వేల వడ్డీ చెల్లిస్తుండటంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో సులవుగా డబ్బు సంపాదించేందుకు ఎవరినైనా కిడ్నాప్ చేయాలని నవీన్ పథకం వేసి.. జూన్ 26న హైదరాబాద్‌కు మకాం మార్చాడు.  వెంకటగిరి కాలనీలో ఉంటున్న స్నేహితుల వద్దకు వచ్చాడు. జీఆర్‌ఏ పరీక్షకు కోచింగ్ తీసుకొనే వారు ధనవంతులవుతారని, వారిని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా కేపీహెచ్‌బీలోని బ్రూ క్లిన్ ప్రివ్యూ కోచింగ్ సెంటర్‌లో చేరాడు.

కిడ్నాప్ చేసిన వారిని నిర్భందించేందుకు హౌసింగ్‌బోర్డులో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కోచింగ్ సెంటర్‌లో మొదట విజయవాడకు చెందిన మహేష్ ధనవంతుడిగా గుర్తించి, పరిచయం పెంచుకున్నాడు. తన ఫ్లాట్‌కు పిలిచి మద్యం తాగించబోయాడు. అతడు నిరాకరించడంతో కిడ్నాప్ పథకం బెడిసికొట్టింది. సాయి అనే విద్యార్థిని తన రూమ్‌కు ఆహ్వానించగా అతను నిరాకరించాడు. ఇదిలా ఉండగా... వైజాగ్‌కు చెందిన కాపారపు శివనాయుడు కుమారుడు అరుణ్ కుమార్ (31) వైజాగ్‌లో నగల షాపు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

అనుభవం కోసం తన బంధువుల షాపులో కొన్ని రోజు పని చేద్దామని 3 నెలల క్రితం నగరానికి వచ్చాడు. ఇతనితో ఓ పార్టీలో నవీన్‌కు పరిచయం ఏర్పడింది.  అరుణ్ ఆస్తిపరుడిని గ్రహించిన నవీన్ అతడి ని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. పార్టీ ఇస్తానని గత నెల 22న హౌజింగ్ బోర్డులోని తన ఫ్లాట్‌కు ఆటోలో తీసుకొచ్చాడు. మార్గం మధ్యలో మద్యం బాటిల్ కాన్నాడు. ఫొటోలు చూస్తానని అరుణ్ సెల్‌ఫోన్ తీసుకొని స్విచ్ఛాప్ చేశాడు. తర్వాత మద్యంలో నిద్రమాత్రలు వేసి తాగించాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది.

అరుణ్ నిద్రలోకి జారుకోగానే..గోనెసంచిలో బంధించి తాళ్లతో బిగించాడు. తర్వాత మేల్కొన్న అరుణ్ పెద్దగా అర్వడంతో కట్టెతో తలపై మోదాడు.  మళ్లీ అరవడంతో మరోసారి మోదాడు. దీంతో అతను చనిపోయాడు. కంగారుపడ్డ నవీన్.. మృతదేహాన్నిఎక్కడైనా వదిలేయాలని నిర్ణయించుకొని ఆటోలో ఎక్కించాడు. తర్వాత చందానగర్‌లోని ద్వారకా హాటల్ సమీపానికి మృతదేహాన్ని తీసుకొచ్చాడు. మద్యం మత్తులో ఉన్నాడని అక్కడి వారికి చెప్పాడు.  మంచినీళ్లు తెచ్చి తాగిస్తానని చెప్పి మృతదేహాన్ని అక్కడే విచి పారిపోయాడు.
 
ఇలా ఛేదించారు...
 
‘సాక్షి’లో వచ్చిన ఫొటో ఆధారంగా మృతుని బంధువులు చందానగర్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించారు. 23న మధ్యాహ్నం అరుణ్ సెల్‌ఫోన్‌ను నవీన్ స్విచ్ఛాన్ చేశాడు. అరుణ్ ఆచూకీ తెలియక అతని ఫోన్‌కు బంధువులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నారు. అతని ఫోన్ లాక్ కావడంతో సిమ్‌కార్డు బయటకు తీసి.. తన వద్ద ఉన్న ఫోన్‌లో వేసి  ‘ నేను క్షేమంగా ఉన్నా.. భయపడవద్దు’అని అరుణ్ కుటుంబసభ్యులకు మెసేజ్ చేశాడు. అయితే, పోలీసులు ఆ సెల్‌ఫోన్ గతంలో ఉపయోగించిన నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నవీన్ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు.

మరిన్ని వార్తలు