క‌ళ్లెదుటే తండ్రిని చంప‌డంతో.. కొడుకు అత‌డిని వెంబ‌డించి మ‌రీ..

2 Dec, 2023 16:20 IST|Sakshi

పాతకక్షలు.. ప్రతీకార హత్యలు!

సాక్షి, ఆదిలాబాద్‌: పాత కక్షలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి. పట్టణంలోని బెస్తవాడకు చెందిన బామ్మె శ్రీను(30), గుబుడె శ్రావణ్‌(45) హత్యలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవాడకు చెందిన బామ్నె శ్రీను కూలీ పని చేసుకుని జీవిస్తుండగా, అదే కాలనీకి చెందిన గుబుడె శ్రావణ్‌ చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.

కాలనీలో ఇద్దరి నివాసాలు దగ్గరదగ్గరే ఉన్నాయి. పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం రాత్రి తాగిన మైకంలో బామ్నె శ్రీను గొడ్డలితో గుబుడె శ్రావణ్‌ మెడపై దాడి చేశాడు. రక్తం మడుగులో కింద పడిపోయిన శ్రావణ్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి చేసిన గొడ్డలి అక్కడే పడేసిన శ్రీను లొంగిపోయేందుకు పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరాడు. ఇది గమనించిన శ్రావణ్‌ కుమారుడు అనిల్‌ అక్కడి నుంచి శ్రీనును వెంబడించాడు.

పట్టణంలోని గణేశ్‌ మందిర్‌ సమీపంలో రోడ్డుపై అదే గొడ్డలితో శ్రీను మెడపై నరకడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు హత్యల విషయం పట్టణంలో సంచలనం రేపింది. సమాచారం అందుకున్న ఎస్పీ సురేశ్‌కుమార్‌, డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని కారణాలు తెలుసుకున్నారు. పాత కక్షలతోనే హత్యలు జరిగినట్లు భావిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మృతుడు శ్రీనుకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా, శ్రావణ్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు.
ఇవి చ‌ద‌వండి: పాత కక్షలతో వ్య‌క్తిని విచక్షణారహితంగా పొడిచి..

మరిన్ని వార్తలు