పన్నూ హత్యకు కుట్ర.. అమెరికా ఆరోపణలను ఖండించిన భారత్

30 Nov, 2023 20:03 IST|Sakshi

ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూను హతమార్చాలనే కుట్రలో భారతీయ పౌరుడి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపణలను భారత్  ఖండించింది. ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. తమ విధానాలకు పూర్తి విరుద్ధమని తెలుపుతూ అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. 

గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్య కుట్ర కేసులో నిందితుడికి భారత అధికారితో సంబంధం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఖండించారు. ఇది తమ దేశ విదేశాంగ విధానానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్ధిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా వైఖరిపై కూడా బాగ్చి మాట్లాడారు. భారత్ వ్యతిరేక శక్తులకు కెనడా స్వర్గధామంగా మారడమే ప్రధాన సమస్య అని చెప్పారు. దౌత్యసంబంధాలపై వియన్నా ఒప్పందాన్ని కెనడా గౌరవించాలని మేం కోరుకుంటున్నామని బాగ్చీ చెప్పారు. 

అమెరికాలో నివసిస్తున్న ఒక సిక్కు వేర్పాటువాది హత్యకు భారత్ నుంచే కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఒక ప్రకటనలో ఇటీవల ఆరోపించింది. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

ఇదీ చదవండి: ‘న్యూయార్క్‌లో హత్యకు కుట్ర పన్నింది ఆ భారతీయుడే’!

మరిన్ని వార్తలు