‘ఆయకట్టు’ ఆవేదన 

17 Jun, 2018 08:49 IST|Sakshi
వట్టిపోయిన కిన్నెరసాని ఎడమ కాలువ

సాక్షి, కొత్తగూడెం : కిన్నెరసాని రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువల ద్వారా పాల్వంచ, బూర్గంపాడు మండలాలకు సాగునీరందడంలేదు. నీటిపారుదల శాఖ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీపీఎస్‌ అవసరాల నిమిత్తం నిర్మించిన కిన్నెరసాని రిజర్వాయర్‌ ద్వారా రెండు మండలాల్లోని పదివేల ఎకరాలకు సాగునీరు అందించాలని.. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005 డిసెంబరు 31న కాలువలకు శంకుస్థాపన చేశారు. ఎడమ కాలువ ద్వారా పాల్వంచ మండలంలోని యానంబైలు, పాండురంగాపురం, బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాక, పినపాక పట్టీనగర్, అంజనాపురం, టేకులచెరువు, జింకలగూడెం, మోరంపల్లి బంజర గ్రామాల వరకు 7వేల ఎకరాలకు నీరందించేలా, కుడి కాలువ ద్వారా పాల్వంచ మండలంలోని పాయకారి యానంబైలు గ్రామం వరకు 3వేల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్ణయించారు.  కాలువ దోమలవాగు చెరువులో కలిసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కాల్వల నిర్మాణం చేపట్టారు. రైతుల కోరిక మేరకు రాజశేఖరరెడ్డి సూచనతో బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, నాగినేనిప్రోలు గ్రామాలకు కూడా నీరందించేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కాగా ఇప్పటివరకు కాలువల పనులు పూర్తికాలేదు.  నీటి సరఫరా కూడా సక్రమంగా చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.  

మంత్రి వస్తున్నారని ఒక్క రోజు వదిలారు 
ఎడమ కాలువ ద్వారా ఇప్పటివరకు ఒక్కసారి కూడా నీరు వదిలిన దాఖలాలు లేవు. గత ఏడాది మంత్రి హరీష్‌రావు వస్తుండడంతో మొక్కుబడిగా ఆ రోజు నీరు వదిలి చేతులు దులుపుకున్నారు. రాజన్న హయాంలో అలైన్‌మెంట్‌ మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో లక్ష్మీపురం, నాగినేనిప్రోలు గ్రామం వరకు 4 కిలోమీటర్ల మేర కాలువ కోసం ఇప్పటివరకు భూసేకరణ సైతం చేయలేదు. మహానేత మరణానంతరం మళ్లీ పాత పద్ధతి ప్రకారం దోమలవాగులోనే కాలువ ముగిసేలా తంతు పూర్తి చేశారు. ఇప్పుడున్న కాలువ ద్వారా కూడా నీటిపారుదల చేస్తున్న దాఖలాలు లేవు. నీటిపారుదల అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు. ఇక కొత్తగా వస్తున్న సీతారామ కాలువ 19.1(కిలోమీటర్‌) వద్ద కిన్నెరసాని కాలువను క్రాస్‌ చేసుకుంటూ వెళుతోంది. దీంతో డిస్ట్రిబ్యూటరీ కాలువలు సీతారామ కాలువ కింద పోతున్నాయని, దీంతో కిన్నెరసాని నీరు వచ్చే అవకాశం లేదని బూర్గంపాడు మండల రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

సీతారామ కెనాల్‌ క్రాసింగ్‌ వద్ద స్ట్రక్చర్‌  
సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సదరు కాలువ క్రాస్‌ చేస్తున్న 19.1 వద్ద కిన్నెరసాని నీరు పైనుంచి వెళ్లేవిధంగా ప్రత్యేక స్ట్రక్చర్‌ నిర్మించేందుకు నిర్ణయించాం. గత ఏడాది ఎడమ కాలువకు నీరివ్వడం ప్రారంభించగా ఈ ఏడాది నుంచి కొనసాగిస్తాం. దోమలవాగు వద్ద కిన్నెరసాని కాలువ ముగుస్తుంది.  
–వెంకటేశ్వరరెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ 

మరిన్ని వార్తలు