హెడ్‌కానిస్టేబుల్‌ మృతి: కిషన్‌రెడ్డి విచారం

24 Feb, 2020 19:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో జరిగిన రాళ్లదాడిలో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి చెందడం పట్ల హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్న వారు పోలీసులపై రాళ్లు విసిరి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారతదేశ పర్యటనలో ఉన్న సమయంలో ఆందోళనలు చేస్తూ, దాడులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అతిపెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డారు. భారత్‌ ఇమేజ్‌ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని కుట్రపూరిత చర్యగా అభివర్ణించారు. (సీఏఏ రగడ : హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి)

దీనివల్ల ఏ భారతీయుడికి నష్టం?
‘ట్రంప్‌ వస్తున్న సమయంలో దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మత విభజనకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశానికి మంచిది కాదు. దీనికి బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటారా.. అసదుద్దీన్ తీసుకుంటారా? రెండు నెలలుగా షాహిన్‌బాగ్‌లో జాతీయ రహదారి దిగ్భందించి ధర్నా చేస్తున్నా మేం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈ రోజు జరిగిన దాడిపై తీవ్రంగా చర్యలు తీసుకుంటాం. శాంతియుత ఆందోళనలు చేస్తే ఇబ్బంది లేదు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదనపు బలగాలను కూడా ఆందోళనలు జరిగే ప్రాంతాలకు పంపుతున్నాం. దేశ ప్రజలు ఇలాంటి ఘటనలను చేస్తున్న వారి పట్ల ఆలోచన చేయాలి. అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు అందరికీ స్వేచ్ఛ ఉంది. సీఏఏ వల్ల ఏ భారతీయుడికి నష్టం జరుగుతుందో చెప్పాలని సవాల్ విసురుతున్నా. ఒక్క అక్షరం భారత పౌరులకు వ్యతిరేకంగా ఉన్నా మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. (రాజధానిలో మళ్లీ సీఏఏ రగడ)

మరిన్ని వార్తలు