అనుకూల ఓటింగ్‌ను పెంచాలి

30 Nov, 2023 02:59 IST|Sakshi

పోలింగ్‌ శాతం పెంపుపై కూడా దృష్టి పెట్టాలి

అభ్యర్థులకు, బూత్‌ కమిటీలకు బీజేపీ దిశానిర్దేశం

ప్రలోభాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పోటీ చేస్తున్న 111 నియోజకవర్గాల్లో పార్టీ అనుకూల ఓటింగ్‌ను, మరి ముఖ్యంగా పోలింగ్‌ శాతాన్ని పెంచే చర్యలపై బీజేపీ దృష్టి పెట్టింది. గురువారం పోలింగ్‌ సందర్భంగా అప్రమత్తంగా వ్యవహరించాలని, పార్టీ అనుకూలురు ఓటు వేసేలా చూడటంతో పాటు పోలింగ్‌ బూత్‌లలో ఎలాంటి అక్రమా లు, అవకతవకలు చోటుచేసుకోకుండా జా›గ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు, అభ్యర్థులు, పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులకు రాష్ట్రపార్టీ  ముఖ్య నేతలు సూచించినట్టు తెలిసింది.

ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఓ కన్నేసి ఉంచాలని, ఎక్కడైనా ఇలాంటి సూచనలు కన్పిస్తే వెంటనే ఈసీ విజిల్‌ యాప్‌ను వినియోగించుకుని ఫిర్యాదులు నమోదు చేయాలని పేర్కొన్నట్టు సమాచారం. బుధవారం పార్టీ కార్యాలయం నుంచి వివిధ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు,  పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులతో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఉదయం నుంచి పోలింగ్‌ ముగిసే దాకా బూత్‌ కమిటీల సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్‌ సరళిపై ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గంట గంటకు ఓటింగ్‌ సరళిని, శాతాలను ప్రత్యేక దృష్టితో గమనించాలని చెప్పారు. 

మంచి ఫలితాలపై ఆశాభావం
ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌ మహానగరం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు మరి కొన్ని చోట్ల పార్టీ అనుకూల ఓటింగ్‌ను గణనీయంగా పెంచుకోవడం ద్వారా ఈసారి మంచి ఫలితాలు సాధించవచ్చునని పార్టీవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రధాని మోదీ, అగ్రనేతలు అమిత్‌సా, జేపీనడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు ఇతర ముఖ్య నేతలు నిర్వహించిన విస్తృత ప్రచారం వల్ల ఎన్నికల్లో పార్టీకి తప్పకుండా మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు