ఆవేశమే అక్షరం రాయించింది

30 Jan, 2019 01:50 IST|Sakshi
మంగళవారం ఢిల్లీలో చంద్రశేఖర్‌ కంబార్‌ చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంటున్న కొలకలూరి ఇనాక్‌

ఆచార్య కొలకలూరి ఇనాక్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాయాలన్న ఆవేశమే తనచేత ఇప్పటి వరకు 96 పుస్తకాలు రాసేలా చేసిందని ప్రముఖ రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌ అన్నారు. రాయాల్సిన అవసరం, ఆవేశం, ఆవేదన, సమాజంలో కావాల్సిన పరిణామాలకు హేతువు అయిన దృక్పథం తాను రచనలు చేసేందుకు ప్రేరేపించిందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన రచించిన ‘విమర్శిని’వ్యాస రచనకు 2018 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబార్‌ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రచనలు, కవిత్వాలు, అనువాదాలు రాసినా ‘విమర్శిని’వ్యాసరచనకు పురస్కారం వరించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు యువత అద్భుతంగా సాహిత్యం రాస్తోందని, వారి నుంచి గొప్ప సాహిత్యం వస్తోందన్నారు. సామాజిక జీవితాన్ని సందర్శించానికి సిద్ధంగా ఉన్న యువత గొప్ప సాహిత్యాన్ని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా కొలకలూరి ఇనాక్‌ కుమారుడు శ్రీకిరణ్, కుమార్తె ఆశా జ్యోతి, కోడలు అనిత పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు