కొండనెక్కిన ‘కొండ’

1 Mar, 2020 15:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొండ కొండనెక్కడం ఏంటనుకుంటున్నారా? అవునండి నిజమే, వయసుతో సంబంధం లేకుండా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఓ సాహసం చేశారు. సంక్షిష్టమైన దారులతో, ఒళ్లు గగుర్పొడిచేలా ఏటవాలుగా ఉండే మార్గాలతో ఆద్యంతం ప్రమాదకరంగా ఉండే అత్యంత కఠినమైన కలావంతిన్‌ దర్గ్‌పై విజయవంతంగా ట్రెక్కింగ్‌ చేశారు. మహారాష్ట్రాలో రాయిఘడ్‌ జిల్లాలోని కలావంతిన్‌ దర్గ్‌పై ట్రెక్కింగ్‌ చేసిన ఫోటోలను కొండా విశ్వేశ్వరరెడ్డి తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దారులు భయంకరంగా ఉన్నా, శారీరకంగా అలసిపోయినా, ఈ ట్రెక్కింగ్‌ మంచి అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కొండనెక్కాలంటే.. కొండంత ధైర్యం ఉండాలంటూ నెటిజన్లు విశ్వేశ్వరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

పశ్చిమ కనుమల్లోనే అత్యంత ప్రమాదకరమైన ఈ కొండపై ట్రెక్కింగ్‌కి వెళ్లి 2016లో హైదరాబాద్‌కి చెందిన 27 ఏళ్ల రచిత గుప్త అనే యువతి మృతిచెందారు. మరణించిన 10 రోజుల అనంతరం ఆమె మృతదేహం లభ్యమైంది. 2018లో పూణేకి చెందిన 28 ఏళ్ల చేతన్‌ దండే అనే ట్రెక్కర్‌ కొండ అంచు, ఇంకా 15 అడుగుల దూరంలో ఉండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందారు.

మరిన్ని వార్తలు