మళ్లీ కవితనే ఎంపీ.. 

10 Apr, 2019 14:31 IST|Sakshi
మాట్లాడుతున్న కొప్పుల ఈశ్వర్, పక్కన ఎంపీ అభ్యర్థి కవిత, ఎమ్మెల్యేలు  

సర్వేలో ఆమెకు 66శాతం ప్రజల మద్దతు 

జగిత్యాలలో మంత్రి కొప్పల ఈశ్వర్‌ 

సాక్షి, జగిత్యాల: రైతుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూ, పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ మాత్రమేనని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలోనే తెలంగాణను దేశంలో మోడల్‌గా నిలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చావుదెబ్బతిన్నాయని, టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అసత్య ప్రచారాలతో కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కూడ దక్కలేదన్నారు.

పసుపు పంటకు బోర్డు ఏర్పాటు అంశాన్ని మొట్టమొదట లేవనెత్తింది ఎంపీ కవితేనని గుర్తుచేశారు. బోర్డు ఏర్పాటుకు బీజేపీని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోగా ఎన్నికల ముందు కొత్తడ్రామాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కి పనితీరును గతంలోనే చూశామని, ఆయన రాత్‌కి రాజా అని వ్యాఖ్యానించారు.తమ సర్వేలో నిజామాబాద్‌ అభ్యర్థి కవితకు 66 శాతం ప్రజల మద్దతు ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, వారితో మమేకమయ్యే కవితను మళ్లీ గెలిపించాలని కోరారు. 


నా పనితీరు నచ్చితే గెలిపించండి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత 
పసుపు బోర్డు సాధనకు తాను పదవీ చేపట్టిన 15 నెలల్లోనే ప్రయత్నం ప్రారంభించానని ఎంపీ కవిత అన్నారు. ఎన్నోసార్లు రాజకీయంగా ఒత్తిడి పెంచినా, ఇవ్వాల్సిన స్థితిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. సాక్ష్యాత్తు ప్రధానమంత్రి వాగ్దానాన్ని కూడా దిక్కులేదని, మేనిఫెస్టోలో కూడ పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ కలిసిపోయాయని, కాంగ్రెస్‌ ప్రచారం కూడా చేయడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి బీజేపీకి ఓటు వేయాలని కాంగ్రెస్‌ నాయకులు తమ క్యాడర్‌కు చెబుతున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు కొట్లాడుకుంటున్న జాతీయ పార్టీలు నిజామాబాద్‌ ఎన్నికల్లో ఒక్కటయ్యాయని చెప్పారు.

జగిత్యాల పట్టణాన్ని కరీంనగర్‌కు ధీటుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మే 1 తర్వాత పీఎఫ్‌ ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్‌ అందజేస్తామని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేస్తామని తెలిపారు. ఎంపీగా తన పనితీరు బాగుందన్పిస్తే మళ్లీ ఓటేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతున్నారన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కన్పించకుండా పోయిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు.ఎంపీగా కవిత పదిరెట్లు పనిచేశారని, ఎప్పుడూ అందుబాటులో ఉండే కవితను మళ్లీ గెలిపించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కోరారు.      

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు