కోరుట్ల 'రెవెన్యూ' డివిజన్‌ 

4 Dec, 2018 18:42 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్, విద్యాసాగర్‌రావు  

ఇది సీఎం కేసీఆర్‌ మాట

మెట్‌పల్లి డివిజన్‌ అలాగే ఉంటుంది

ఈ విషయం చెప్పడానికే వచ్చా

కల్వకుంట్లను ఆశీర్వదించండి

కోరుట్ల సభలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌

సాక్షి, కోరుట్ల: ‘జిల్లాలోనే పెద్ద పట్టణం కోరుట్ల.. దీనిని పక్కాగా రెవెన్యూ డివిజన్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ మాటగా ప్రకటిస్తున్నా..’ అని  ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కోరుట్ల డివిజన్‌ ఏర్పాటు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, మెట్‌పల్లి ప్రజలు ఆగం కావద్దని, మెట్‌పల్లి డివిజన్‌ అలాగే ఉంటుందని తెలిపారు. ఒకే సెగ్మెంట్‌లో రెండు డివిజన్లు ఉంటాయని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్‌ కొట్లాడి తెలంగాణ తెచ్చిండు.. ఇగో అట్లనే మీ కేటీఆర్‌ కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో రెండు రెవెన్యూ డివిజన్లు సాధించి చరిత్ర సృష్టిస్తున్నారు..అని పేర్కొన్నారు. ఈ విషయం చెప్పడానికే ప్రత్యేకంగా కోరుట్లకు వచ్చానని కేటీఆర్‌ పేర్కొన్నారు. త్వరలోనే వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్‌లో ముంబయి రైలు ఆగేలా అనుమతి సాధిస్తామన్నారు. ఈ మూడు హామీలు నేరవేర్చే బాధ్యత తనదేనన్నారు. విద్యాసాగర్‌రావు అందరికీ అందుబాటులో ఉంటాడు.. మూడుసార్లు అభిమానాన్ని చాటి గెలిపించారు.. మరోసారి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి..అని కేటీఆర్‌ కోరారు. 

మహాకూటమి ముసుగులో కాంగ్రెస్‌కు ఓటేయాలని వస్తున్నారు.. వారిని నమ్మద్దు. ఎన్నికలు అయిపోగానే తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికో పోతారు.. ఈ విషయం మీకు కూడా తెలుసు..అందుకే ఎప్పుడూ అందుబాటులో ఉండే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు ఓటేసి ఆశీర్వదించండి..’ అని కోరారు. 24గంటల ఉ చిత కరెంట్, రైతుబంధు, రుణమాఫీతో రైతులకు అండగా నిలిచిన పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. పేద ప్రజల కష్టాలు గుర్తించి సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్‌ కిట్, బీడి, నేత, గీత కార్మికులకు పించన్లు అందించారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పించన్లను రూ.2016 చేస్తామన్నారు. పింఛన్‌ అందించే వయసును 57కు కుదిస్తామన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్‌ సర్కార్‌ కట్టుబడి ఉంటుందన్నారు. సోనియాను తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఆశీర్వదించండి: విద్యాసాగర్‌రావు
కోరుట్ల సెగ్మెంట్‌ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని, మరోసారి ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరారు. పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిరోజూ అందుబాటులో ఉన్నానన్నారు. మిషన్‌ భగీరథతో మంచినీరు, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాల్టీలకు రూ.50కోట్ల చొప్పున నిధులు తెచ్చామన్నారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చాంబర్‌లో ధర్నా చేసి కోరుట్లలో వెటర్నరీ కళాశాలకు రూ.300 కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. సభలో గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కటారి చంద్రశేఖర్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి అ«ధ్యక్షులు చీటి వెంకట్రావు, మున్సిపల్‌ చైర్మన్లు ఉమారాణి, శీలం వేణు, కోరుట్ల పట్టణ, మండల టీఆర్‌ఎస్‌ అ ద్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశం, జడ్పీటిసిలు, ఎంపీటిసిలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు