నేడు ‘కృష్ణా’ త్రిసభ్య కమిటీ భేటీ 

27 Dec, 2018 02:20 IST|Sakshi

ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల కేటాయింపు అంశంపై చర్చించేందుకు గురువారం కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖలు రాశారు. కృష్ణా బోర్డు చేసిన కేటాయింపులపై తెలంగాణ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ భేటీ నిర్వహిస్తున్నారు.

కృష్ణా బేసిన్‌లోని లభ్యతగా ఉన్న జలాల్లో తెలంగాణకు 46.90 టీఎంసీలు, ఏపీకి 33.40 టీఎంసీలను బోర్డు కేటాయించగా, ఏపీ అవసరాల కోసం సాగర్‌ ఎడమ కాల్వ కింద జోన్‌–3కి నీటిని కేటాయించడంపై రాష్ట్రం అభ్యంతరం చెప్పింది. తెలంగాణ పరిధిలోని జోన్‌–2కే నీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో జోన్‌–3కి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. దీంతో పాటే తెలంగాణకు వాటా ప్రకారం 60 టీఎంసీలు రావాల్సిన పూర్తి స్థాయి కేటాయింపులు చేయకపోవడంపై నిలదీసింది. ఈ భేటీకి ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరయ్యే అవకాశం ఉంది.  
 

మరిన్ని వార్తలు