స్వయంగా ఇల్లు శుభ్రం చేసిన కేటీఆర్‌

10 Sep, 2019 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలు విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సర్కారు చర్యలు చేపట్టింది. పారిశుధ్య నిర్వహణా లోపాన్ని సరిచేస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సీజనల్‌ వ్యాధులు విజృంభించకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో కేటీఆర్‌ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సొంత ఇళ్లలో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. దానిలో భాగంగా తన నివాస గృహం ప్రగతి భవన్‌లో మంగళవారం పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారించారు.

తన ఇంటిని కేటీఆర్‌ స్వయంగా క్లీన్‌ చేశారు. దోమల మందును చల్లారు. నీటి తొట్లలో నూనె వేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సొంత ఇంటి పారిశుధ్య నిర్వహణ డ్రైవ్‌లో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ సొంత ఇంటిలోపల.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కేటీఆర్ వెంబడి నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు శాసన సభలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కూడా ఉన్నారు. మంత్రి ఇచ్చిన పిలుపుమేరకు తాము కూడా సొంత ఇంటి పారిశుధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడతామని కేటీఆర్‌తో చెప్పారు.

ప్రజలకు కేటీఆర్‌ చేసిన సూచనలు.. ‘ఇంటి లోపల పేరుకుపోయిన, వినియోగంలో లేని వస్తువులను తొలగించాలి. ఇళ్లలో నీటి తొట్లు, పూలమొక్కలు ఉన్న చోట్లలో నీరు నిలువకుండా చూడాలి. ప్రజల భాగస్వామ్యంతోనే సీజనల్ వ్యాధుల నివారణ సులభమవుతుంది. జన సమ్మర్థ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ తరపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత నిర్వహణకై అన్ని చర్యలు చేపడుతున్నాం’ అని కేటీఆర్‌ ఓ ప్రకటనలో అన్నారు.

మరిన్ని వార్తలు