'సంక్షేమ' ఘనత సర్కారుదే.. : కేటీఆర్‌

5 Dec, 2018 11:56 IST|Sakshi
ఖమ్మంలోని జెడ్పీ సెంటర్‌లో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌

  కేసీఆర్‌ను అడ్డుకునేందుకు అందరూ కలిశారు 

  ఎన్నికలప్పుడొచ్చే వారిని ప్రజలు నమ్మొద్దు 

  రూ.1000కోట్లతో ఖమ్మంను అభివృద్ధి చేశాం 

  రోడ్‌షోలలో మంత్రి కేటీఆర్‌  

సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్రంలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి.. పకడ్బందీగా అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇంత చేస్తున్నా.. ఒక్క కేసీఆర్‌ను అడ్డుకునేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని, వాటికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతూ మంగళవారం కేటీఆర్‌ నగరంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని జెడ్పీసెంటర్, గాంధీచౌక్‌ కూడళ్లలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా పువ్వాడ అజయ్‌ నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని చెప్పారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఖమ్మం ఒక్కటే కాకుండా ప్రతి పేద వ్యక్తి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారని, ప్రజలందరూ కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.70 పింఛన్‌ ఉండేదని, బస్తీలో పది మందికి వస్తే.. 100 మందికి రాని పరిస్థితి ఉండేదన్నారు.

మాకెందుకు ఇవ్వరని గోల చేస్తే.. పెన్షన్‌ తీసుకునే వారు చనిపోతే మీ పేరు చేరుస్తామనే వారన్నారు. ఇక కాంగ్రెస్‌ హయాంలో రూ.200 పెన్షన్‌ ఇచ్చి జబ్బలు చరుచుకున్నారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లు రూ.1000, వికలాంగుల పింఛన్లు రూ.1,500 ఇస్తున్నామని గుర్తు చేశారు. అజయ్‌కుమార్‌ను గెలిపించి అసెంబ్లీకి పంపితే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే.. ఆసరా పింఛన్లు రూ.2,016కు పెరుగుతాయరని, వికలాంగుల పింఛన్లు రూ.3,016కు పెరుగుతాయని తెలిపారు. ఇప్పుడు పింఛన్లు 65 ఏళ్ల వయసులో ఇస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వస్తే ఆ వయసును 55 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. ఒక్క ఖమ్మంలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు 2వేల పైచిలుకు ఇచ్చుకున్నామని, ఇంకా ఇళ్లు కావాలని పేదల్లో డిమాండ్‌ ఉందని, అయితే కొన్నిచోట్ల జాగా దొరకడం లేదని, మరికొన్నిచోట్ల కాంట్రాక్టర్ల సమస్య ఉందని.. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎక్కడ జాగా ఉంటే అక్కడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షలు అందిస్తామని చెప్పారు. గతంలో పేదలకు అందించే రేషన్‌ బియ్యంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం కోత పెట్టిందని విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చుకుంటున్నామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని, గతంలో పేదింటి ఆడపిల్ల పెళ్లి అంటే మేనమామలు కూడా ముఖం చాటేసిన పరిస్థితి ఉండేదని, పేదింటి ఆడబిడ్డ కులం.. మతంతో సంబంధం లేకుండా తెల్లకార్డు ఉంటే చాలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద రూ.లక్ష అందిస్తున్నామని తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై అనేక విమర్శలు ఉండేవని, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు కూడా వచ్చాయని, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల తీరు మారిందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్కార్‌ దవాఖానాకే పోతాను.. అక్కడే ప్రసూతి చేయించుకుంటాను.. అనేలా ఉన్నాయన్నారు. ఇక ఆటో డ్రైవర్ల కోçసం రాష్ట్రవ్యాప్తంగా రూ.73కోట్ల రవాణా పన్నును రద్దు చేసింది ఒక్క టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, వంటి కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా.. ఒకవైపు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తూనే.. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ.. ఇంకా ఉద్యోగం రానివారి కోసం ఈసారి కేసీఆర్‌ సీఎం కాగానే రూ.3వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ఫిట్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు.

నాలుగున్నరేళ్లలో ఖమ్మంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశామని, లకారం చెరువు ఆధునికీకరణ, రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి పనులను చూసి ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు కుళ్లు కుంటున్నారన్నారు. నాలుగున్నరేళ్లలోనే ఇంత అభివృద్ధి చేసి చూపించాం.. ఆలోచించి ఓటేయండి అంటూ ఓటర్లను కోరారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అజయ్‌కుమార్‌ ఇక్కడే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. చుట్టపు చూపుగా.. ఎప్పుడో ఒక్కసారి వచ్చిపోయే నాయకుడు నామా అని అన్నారు. త్రీటౌన్‌ ప్రాంతంలోని మార్కెట్‌ను ఎక్కడికీ తరలించమని చెప్పారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం అభివృద్ధి టీఆర్‌ఎస్‌ పాలనలోనే సాధ్యమైందన్నారు. మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించి ఖమ్మంను మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్యే ఉండే పువ్వాడ అజయ్‌కుమార్‌ గెలుపుతోనే నగర అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకు తీసుకెళ్లి అందించిన ఘనత పువ్వాడ అజయ్‌కుమార్‌కే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందాలనే లక్ష్యంతో అజయ్‌ పని చేశారన్నారు. మళ్లీ అజయ్‌ని గెలిపించుకోవడం ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అజయ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్, మేయర్‌ పాపాలాల్, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్, జిల్లా నాయకుడు ఆర్జేసీ కృష్ణ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తాలు...

మరిన్ని వార్తలు