కావాలంటే గూగుల్‌పై దావా వేసుకో

20 Nov, 2017 11:31 IST|Sakshi

హైదరాబాద్‌ : కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌ అభివృద్ధిపై ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌కు, ఓ కాంగ్రెస్‌కార్యకర్తకు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌కు సంబంధించి 2011, 2016 సంవత్సరాల్లో గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి తీసిన రెండు ఫోటోలను కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. నగరపౌరులకు ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న బొటానికల్‌ గార్డెన్‌ను 2011లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రైవైట్‌ సంస్థలకు కట్టబెట్టి నాశనం చేయాలని చూసిందని 2011లో తీసిన ఓ ఫోటోనుపెట్టారు.  270 ఎకరాల పార్క్‌ను కాపాడి అందులో పచ్చదనాన్ని పెంపొందించామని పేర్కొంటూ.. గూగుల్‌ మాప్స్‌ నుంచి నవంబర్‌ 2016లో తీసిన మరో ఫోటోని పోస్ట్‌ చేశారు. ఈ రెండు చిత్రాల్లో 2011లో తీసిన ఫోటోలో చెట్లు చాలా పలుచగా ఉన్నట్టు, 2016లో తీసిన ఫోటోలో చెట్లు దట్టంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
 

అయితే కేటీఆర్‌ పెట్టిన పోస్టుపై ప్రియబ్రతా త్రిపాఠి(కాంగ్రెస్‌ కార్యకర్త- ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం) లయ్యర్‌(అబద్దాలకోరు) అంటూ మండిపడ్డారు. 2012లో ఇదే బొటానికల్‌ గార్డెన్‌లో ఎన్నో మొక్కలు, పూలను నా కెమెరాతో ఫోటోలు తీశాను. 2016లో తిరిగి అదే గార్డెన్‌కు వెళ్లాను కానీ అప్పుడు బొటానికల్‌ గార్డెన్‌ మొత్తం చెత్తగా ఉంది అని పేర్కొన్నారు.
 

దీనికి కేటీఆర్‌ ట్విట్టర్‌లో బదులిస్తూ.. అయితే గూగుల్‌ పై కేసు వేయండి సర్‌, పనిలోపనిగా మీ కెమెరా లెన్స్‌ కూడా మార్చండి.. అంటూ ఛలోక్తి విసిరారు. స్కామ్‌గ్రెస్‌మెన్ ‌( స్కాం+ కాంగ్రెస్‌.. అర్థం వచ్చేలా) నిజాన్ని ఒప్పుకోలేరని పేర్కొన్నారు. లయ్యర్‌ పదాన్ని వాడినందుకు క్షమించండి అంటూ  ప్రియబ్రతా త్రిపాఠి మరో ట్వీట్‌ చేశారు. అయితే ఇప్పటి వరకు స్కాముల్లో ఇరుక్కున్న కాంగ్రెస్‌ పార్టీ వారిని మీరు ఎంతమందిని విచారించారు. వ్యక్తిగతంగా మీపై ఎలాంటి ఆరోపణలు లేవా అంటూ పోస్ట్‌ పెట్టారు.
 

మీరు చేస్తున్న మంచి పనికి కృతజ్ఞతలు‌.అనవసరపు ఆరోణలపై స్పందించకండి సర్‌ అంటూ ఓ నెటిజన్‌ కేటీఆర్‌కు సూచించారు. దీనికి స్పందిస్తూ.. స్వాతంత్ర్యం పొంది 70 ఏళ్లుగడిచినా, ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. వీటికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నిరాధారమైన, బాధ్యత లేకుండా చేస్తున్న ఆరోపణలు మాత్రమే ఖండించానని తెలిపారు.

 

2012 జనవరి, అక్టోబర్ 2012లో బొటానికల్‌ గార్డెన్‌కు సంబంధించి తీసిన రెండు గూగుల్‌ మ్యాప్స్‌ ఫోటోలను ప్రియబ్రతా త్రిపాఠి పోస్ట్‌ చేశారు. వాతావరణ మార్పుల ఆధారంగానే గూగుల్‌ మ్యాప్స్‌ ఫోటోల్లో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు