సిగ్నల్‌ ఫ్రీ.. రవాణాకు రూట్‌ క్లియర్‌

5 Nov, 2019 04:44 IST|Sakshi
ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో సబితా ఇంద్రారెడ్డి తదితరులు

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌/గచ్చిబౌలి: గ్రేటర్‌ నగరంలో  ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా సిగ్నల్‌ ఫ్రీ రవాణా కోసం మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్‌లో బయోడైవర్సిటీ జంక్షన్‌ డబుల్‌ హైట్‌ ఫ్లై ఓవర్‌ను  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రి  కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. దీంతో, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనదారులు సిగ్నల్‌తో పని లేకుండా హైటెక్‌సిటీకి వెళ్లవచ్చు. ఎస్సార్‌డీపీలో భాగంగా ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన అండర్‌పాస్‌లు/ఫ్లైఓవర్లలో ఇది ఎనిమిదవది. దీనికోసం జీహెచ్‌ఎంసీ రూ. 69.47 కోట్లు ఖర్చు చేసింది. 3 లేన్ల ఈ ఫ్లై ఓవర్‌ పొడవు దాదాపు కిలోమీటరు. ఈ ఫ్లైఓవర్‌తో : మెహిదీపట్నం వైపు నుంచి హైటెక్‌సిటీ, మైండ్‌ స్పేస్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థకు మార్గం సుగమమైంది.ఎస్సార్‌డీపీలో భాగంగా  ఐటీ కారిడార్‌లో ఇప్పటికే మైండ్‌స్పేస్‌ జంక్షన్, కూకట్‌పల్లి  జంక్షన్‌ల వద్ద ఫ్లైఓవర్లు, మైండ్‌స్పేస్, అయ్యప్ప సొసైటీల వద్ద అండర్‌పాస్‌లు అందుబాటులోకి రావడంతో బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి జేఎన్‌ టీయూ వరకు వరకుట్రాఫిక్‌ చిక్కులు తగ్గాయి.

ఇక గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద..: గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి రూ. 330 కోట్లతో కొండాపూర్‌ వైపు నుంచి ఓఆర్‌ఆర్‌ వైపు గచ్చిబౌలి జంక్షన్‌  వద్ద  పై  వరుసలో ఆరులేన్ల ఫ్లై ఓవర్,  మైండ్‌స్పేస్‌ వైపు నుంచి  ఓఆర్‌ఆర్‌ వైపు  నాలుగు లేన్ల ఫ్లైవర్, శిల్పా లే ఔట్‌ రోడ్‌ వైపు నుంచి గ్యాస్‌ గోడౌన్‌ వరకు మరో మార్గం  నిర్మించనున్నారు. ఈ పనులకు కూడా కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. వీటిద్వారా రెండు వైపులా ప్రయాణాలు చేయవచ్చు. వీటి ద్వారా ఐటీ కారిడార్‌పై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం గచ్చిబౌలి మార్గంలో  గంటకు 9 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. 2036 నాటికి వీటి సంఖ్య 17,711 పెరిగే అవకాశం ఉంది. శిల్పా లే ఔట్‌ మార్గంలో  2040నాటికి  5,200లకు చేరే అవకాశం ఉంది.కొత్తగా నిర్మించనున్న ఫ్లైఓవర్ల వల్ల  గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్యలు పూర్తిగా తగ్గడంతో పాటు హైటెక్‌ సిటీ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ల మార్గాలకు మరింత  కనెక్టివిటీ పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు