ప్రజల ఆశీర్వాదం కోసమే!

7 Apr, 2017 02:30 IST|Sakshi
ప్రజల ఆశీర్వాదం కోసమే!

తనే వారసుడిననే ప్రచారాన్ని బలపరిచేలా కేటీఆర్‌ ప్రసంగాలు
వరుసగా ఎన్నికల సభల్లో పాల్గొంటున్న కేసీఆర్‌ కుమారుడు
ప్రభుత్వ పథకాలు, హామీల ప్రస్తావనలు
విపక్షాలపై విమర్శల దూకుడు
తాజాగా ఎన్నికల ప్రచార సభను తలపించేలా ఆర్మూరు సభ  


సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, మంత్రి కె.తారక రామారావు ఇటీవల విస్తృతంగా పార్టీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అటు ప్రభుత్వ పథకాల అమలును ఘనంగా వివరిస్తూనే.. ఇటు విప క్షాలపై విమర్శల దూకుడును పెంచుతున్నా రు. కేటీఆర్‌ త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పగ్గాలు చేపట్టనున్నారనే ప్రచారాన్ని ఇవన్నీ బలపరుస్తున్నాయని చెబుతున్నారు.

వరుసగా సభల్లో..
టీఆర్‌ఎస్‌ ఇటీవల వరుసగా నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తోంది. వాటిలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, తాండూరు, కొల్లాపూర్‌ సభల్లో పాల్గొనగా.. గురువారం ఆర్మూరు సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సభను తలపించేలా జన సమీకరణ, ఏర్పాట్లు జరిగిన ఈ సభలో కేటీఆర్‌ ప్రసంగిస్తూ.. పార్టీ భవిష్యత్‌ తానేనన్న ప్రచారాన్ని బలపరిచేలా మాట్లాడారు. అంతకు ముందు ప్రసంగించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు డీఎస్, కవిత తదితరులు కూడా కేసీఆర్‌ రాజకీయ వారసుడు కేటీఆరేనన్న రీతిలో ప్రసంగించారు. చివరగా ప్రసంగించిన మంత్రి కేటీఆర్‌.. ‘మీ అందరి ఆశీర్వాదం ఉండాలి..’అంటూ ముగించడం గమనార్హం.

ప్రభుత్వ పనితీరుపై వివరణ
దాదాపు మూడేళ్ల కింద పాలన పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌.. దేశంలో తెలంగాణను ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతోందని, ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తోందని కేటీఆర్‌ తన ప్రసంగాల్లో వివరిస్తున్నారు. విద్యుత్, పింఛన్లు, రేషన్‌ బియ్యం, మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం, సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించడం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బీడీ కార్మికులSకు పెన్షన్లు తదితర ప్రభుత్వ కార్యక్రమా లన్నింటినీ ప్రస్తావించారు. తమది పేదల ప్రభుత్వమో, పెద్దల ప్రభుత్వమో ప్రజలే బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు కూడా.

విపక్షాలపై విమర్శల దూకుడు
దేశాన్ని, రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతోందంటూ కేటీఆర్‌ ఇటీవల దుమ్మెత్తి పోశారు. ఒక జిల్లాలో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టులకు ఎక్కుతూ, మరో జిల్లాలో ప్రాజñ క్టులు కావాలని పాదయాత్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలంటే కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా గల్లంతుకావాలని పిలుపునిచ్చారు కూడా. ఇలా కాంగ్రెస్, టీడీపీలపై రాజకీయ విమర్శలు చేస్తూనే... తన శాఖ పరిధిలో చేయగలిగిన పనుల హామీలూ ఇస్తున్నారు. ఇక పార్టీ నేతలు సంఘాల వారీగా కేటీఆర్‌కు సన్మానాలు చేయడానికి పోటీపడ్డారు. ఒకే వేదికను తొలిసారి పంచుకున్న మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత ఒకరి సమర్థత గురించి మరొకరు కితాబిచ్చుకున్నారు. మొత్తంగా పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతగా ఎదిగే క్రమంలో సామాన్య జనానికి చేరువయ్యేందుకు, వారి మనసు చూరగొనేందుకు కేటీఆర్‌ ఈ సభలను వినియోగించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు