కాంగ్రెస్‌ తీరుపై కథ చెప్పిన కేటీర్‌

15 Jul, 2017 19:17 IST|Sakshi
కాంగ్రెస్‌ తీరుపై కథ చెప్పిన కేటీర్‌

నారాయణ్‌పేట్‌: కాంగ్రెస్‌ పార్టీ నేతలపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. అరవై ఏళ్లపాటు పాలించి రాష్ట్రంలో గబ్బును పోగేశారని, అది కేవలం మూడేళ్లలో పోగొట్టాలంటే సాధ్యమేనా అని ప్రశ్నించారు. వారేదో తమకు చందమామ అందిస్తే తాము మసిపూసి ఆగం జేసినట్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు. శనివారం నారాయణ్‌పేట్‌ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఇటీవల నారాయణ్‌పేట్‌లో రోడ్ల నిర్మాణంపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధర్నాలు చేయడం ఉద్దేశిస్తూ ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ వారు 60 ఏళ్లలో చేయలేనిది తమకు మూడేళ్లలో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వారు చెప్పేది వింటుంటే తనకు చిన్న కథ గుర్తొస్తుందంటూ కాంగ్రెస్‌ తీరును ఉదహరించారు. కేటీఆర్‌ ఏం కథ చెప్పారంటే..

'నారాయణ్‌పేట్‌లాంటి ఓ గ్రామంలో ఓ పిల్లాడు ఉండే వాడు. అతడికి ఏమేం చెడు అలవాట్లు కాకుడదో అవన్నీ అయ్యాయి. కిల్లీ, గుట్కా, సిగరెట్‌, మద్యం ఇలా చెప్పడానికి వీలుకానీ చెడు అలవాట్లన్నీ అయ్యాయి. ఇదేమిటని మందలించిన తల్లిని బాగా తాగిన మైకంలో రోకలబండతో కొడితే ఆ తల్లి చనిపోయింది. తండ్రి ప్రశ్నిస్తే తండ్రిని అలాగే కొట్టి చంపాడు. చివరకు పోలీసులు అరెస్టు చేసి (నవ్వుకుంటూ) జూపల్లి కృష్ణారావులాంటి జడ్జీ ముందుకు తీసుకెళ్లారు.

ఆ పిల్లాడ్ని కిందకు మీదకు చూసి తాను ఇప్పటి వరకు ఎన్నో దిక్కుమాలిన కేసులు చూసినగానీ ఇలాంటి కేసులో ఎప్పుడూ తీర్పు చెప్పలేదు. ఇలాంటి పని చేసిన నీకు ఏ శిక్ష వేయాలి చెప్పురా బాబంటే.. అప్పటి వరకు రొమ్ములు విరుస్తూ నిల్చున్న ఆ పిల్లాడు వెంటనే చేతులు కట్టుకొని తల్లిదండ్రులు లేని అనాథని బాబయ్యా వదిలేయండయ్యా అన్నాడంట.. అట్లుంది కాంగ్రెస్‌ తీరు' అని కథ ముగించారు. 60 ఏళ్లపాటు తెలంగాణ వాళ్లను కొట్టింది కాంగ్రెస్‌ వాళ్లుకాదా అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ అసలు మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.