సిటీ కాలేజీకి 'లాల్‌' సలాం!

4 Jul, 2018 02:26 IST|Sakshi

ఎర్ర కోటను తలపించేలా పెయింటింగ్‌ 

రూ.2 కోట్ల ‘రూసా’ నిధులతో మరమ్మతులు

సాక్షి, హైదరాబాద్‌: నిజాం కాలం నాటి నిర్మాణ శైలికి అద్దం పట్టే సిటీ కాలేజ్‌ కొత్త హంగులు సంతరించుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులను అందించిన ఈ కాలేజ్‌ ‘లాల్‌’రంగులు అద్దుకుంటోంది. నిజాం పాలకుల కాలంలో చిన్నారుల చదువు కోసం పాఠశాలగా ప్రారంభమై నేడు ప్రఖ్యాత విద్యాలయం స్థాయికి ఎదిగింది. 97 ఏళ్ల క్రితం 30 మంది విద్యార్థులతో మొదలైన ప్రస్థానం.. 31 యూజీ కోర్సులు, 8 పీజీ కోర్సులతో నేడు వేల మందికి విద్యనందిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ కింద సిటీ కాలేజ్‌కి రూ.2 కోట్ల నిధులు కేటాయించింది.  

జిమ్, కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు.. 
కేంద్రం ఇచ్చిన నిధులతో సిటీ కాలేజ్‌లో పలు నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్‌ సి.మంజుల తెలిపారు. రూసా పలు షరతులతో ఈ నిధులను కేటాయించినట్లు చెప్పారు. రూ.1.50 లక్షలతో భవనానికి పెయింటింగ్, మరమ్మతులు, రూ.10 లక్షలతో జిమ్, రూ.40 లక్షలతో కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.  

ఇదీ కాలేజీ చరిత్ర..  
ఆరవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో మదర్సా దారుల్‌ ఉలూమ్‌ పేరుతో 1865లో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఏడవ నిజాం హయాంలో దీన్ని సిటీ హైస్కూల్‌గా మార్చి, 1921లో భవనాన్ని నిర్మించారు. అదే సంవత్సరం ఇంటర్మీడియట్‌ (ఎఫ్‌ఏ)గా మార్చారు. 1929లో హైస్కూల్‌తో పాటు కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసి.. సిటీ కాలేజ్‌గా పేరు మార్చారు. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక పీయూసీతో పాటు 1962 నుంచి సైన్స్, ఆర్ట్స్‌ డిగ్రీ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఇటాలియన్, హిందూ వాస్తు కళల మిశ్రమంగా రూ.8 లక్షలతో కాలేజ్‌ నిర్మాణం జరిగింది. తూర్పు, పశ్చిమ దిక్కు నుంచి చూసినా ఈ భవనం ఒకే మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో వెయ్యి మంది కూర్చునేలా గ్రేట్‌ హాల్‌ పేరుతో ఓ హాల్‌ను నిర్మించారు. పలు సినిమాల్లో ఈ కాలేజీని రాజమహల్, న్యాయస్థానంగా చూపించారు. రాజకీయ నేతలు శివరాజ్‌ పాటిల్, పీ శివశంకర్, మర్రి చెన్నారెడ్డి, మాజీ క్రికెటర్‌ అర్షద్‌ అయ్యూబ్‌ లాంటి ప్రముఖులంతా ఇక్కడ చదువుకున్నవారే.

మరిన్ని వార్తలు