భూసేకరణ చట్టానికి 3 సవరణలు

26 Apr, 2017 03:07 IST|Sakshi
భూసేకరణ చట్టానికి 3 సవరణలు

- రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచన
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మూడు సవరణలు కోరింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సూచించిన ఈ సవరణలను కేంద్ర న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనలో కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిసినప్పుడు ఈ అంశం చర్చకొచ్చింది.

న్యాయశాఖ తరఫున క్లియరెన్స్‌ ఇచ్చేందుకు సూచనప్రాయంగా కేంద్ర మంత్రి అంగీకరించారు. కేంద్రం సూచించిన సవరణలు చేసేందుకు, కోరిన వివరణలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. అయితే ఏమేం సవరణలు చేయాలనే విషయంలో కేంద్రం నుంచి అధికారికంగా సమాచారం అందలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కేంద్రం నుంచి వచ్చే ప్రతిపాదనల ప్రకారం తగిన మార్పులు చేయాల్సి ఉంటుందని, అవసరాన్ని బట్టి మరోసారి అసెంబ్లీలో సవరణలకు ఆమోదం తీసుకోవాలా లేదా ఆర్డినెన్స్‌ రూపంలో కేంద్రానికి పంపాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నాయి. ప్రధానంగా రాష్ట్రం పంపించిన బిల్లులో పొందుపరిచిన ప్రయోజనాలను 2014కు ముందున్న నిర్వాసితులకు సైతం అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సవరణ కోరినట్లు తెలిసింది.

మిగతా రెండు సవరణలు బిల్లులోని పలు పదాల్లో మార్పులు తప్ప మరేమీ కాదని అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును శాసనసభ ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపించింది. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు