ముందే ‘మ్యూటేషన్‌’

16 Sep, 2018 08:43 IST|Sakshi
ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ కార్యాలయం

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో ఇకపై భూమి క్రయ, విక్రయాలు జరిపేటప్పుడు రిజిస్ట్రేషన్‌ ఫీజుతోపాటు తప్పనిసరిగా మ్యూటేషన్‌ ఫీజు భరించాల్సిందే. దీంతో ఆస్తులు కొనుగోలు చేసేవారు ఇకపై రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఈ భారాన్ని మోయాల్సిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి గెజిట్‌ జారీ అయ్యింది. ఆగస్టు 2న కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతోపాటు మున్సిపాలిటీల్లో పలు గ్రామాల విలీనం జరిగిన విషయం విదితమే. ఈ విలీనం జరిగిన తర్వాత ఆయా గ్రామాలకు సంబంధించి భూ క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రధానంగా ఆ గ్రామాల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణంపై స్పష్టత రాకపోవడంతో ఈ జాప్యం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

0.5 శాతం మ్యూటేషన్‌ ఫీజు
సాధారణంగా ఆస్తుల కొనుగోలు సమయంలో ఇరు పార్టీలు కలిసి రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో కొనుగోలుదారు భూమి మార్కెట్‌ విలువపై 4శాతం స్టాంప్‌ డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో ఏ భూమికైనా ఇదే విధంగా ఉంటుంది. మున్సిపాలిటీలో మాత్రం పేరు మార్పిడికి సంబంధించి అదనంగా మ్యూటేషన్‌ ఫీజు భూమి విలువ మీద 0.5శాతం కూడా రిజిస్ట్రేషన్‌ సమయంలోనే తీసుకోవడం జరుగుతుంది. గ్రామపంచాయతీలో రిజిస్ట్రేషన్‌ తర్వాత నేరుగా జీపీ కార్యాలయంలో మ్యూటేషన్‌ ఫీజు చెల్లించి చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో పలు గ్రామాలు విలీనం చేశారు. వాటికి సంబంధించి ఆగస్టు 2 తర్వాత రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రధానంగా ఆయా వార్డు, బ్లాక్, విస్తీర్ణం వివరాలపై స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం వ్యక్తమైంది. దీంతో రిజిస్ట్రేషన్‌ అధికారులు ఆయా గ్రామాల్లో అప్పటినుంచి రిజిస్ట్రేషన్లను జరపడంలేదు. ఈ నేపథ్యంలో క్రయవిక్రయాలు చేసుకునే వారిలో ఆందోళన వ్యక్తమైంది.

విలీన గ్రామాలు..
ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో విలీనమైన అనుకుంట గ్రామాన్ని వార్డు నెం.13లో కలిపారు. అర్లి(బి) జీపీలోని బెల్లూరి, నిషాన్‌ఘాట్‌ గ్రామాలను వార్డు నెం.3లో, రాంపూర్‌(ఆర్‌)ను వార్డు నెం.32లో, బట్టిసావర్గాం జీపీలోని ఎన్‌హెచ్‌బీ కాలనీ, టైలర్స్‌కాలనీ, పోలీసు కాలనీ, వివేకానంద కాలనీ, అగ్రజా టౌన్‌షిప్, ఆదర్శ్‌కాలనీ, భగత్‌సింగ్‌ కాలనీలను వార్డు నెం.27లో విలీనం చేశారు. మావల గ్రామపంచాయతీ పరిధిలోని దస్నాపూర్, దుర్గానగర్, కేఆర్‌కే కాలనీ, వికలాంగుల కాలనీలో మిగిలిన భాగంతోపాటు అటెండర్‌ కాలనీ, కృష్ణానగర్, ఇందిరమ్మ కాలనీలను వార్డు నెం.19లో విలీనం చేశారు.

మార్కెట్‌ విలువ పాత పద్ధతే..
ఆయా గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమైనప్పటికీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రస్తుతం పాత విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో సబ్‌రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులతో కలిపి మార్కెట్‌ రివిజన్‌ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ప్రతి రెండేళ్లకోసారి భూములకు సంబంధించి రివిజన్‌ చేసి మార్కెట్‌ విలువలను సవరించడం, పెంచడం జరుగుతుంది. ప్రస్తుతానికి విలీన గ్రామాల్లో పాత విలువలోనే రిజిస్ట్రేషన్‌ చేయనుండడంతో ఇప్పటికే ఆయా గ్రామాల్లో క్రయ, విక్రయాల పరంగా రిజిస్ట్రేషన్‌ విలువలో భారీ తేడాలు వచ్చే అవకాశం లేదు. అదనంగా మ్యూటేషన్‌ ఫీజును మాత్రమే భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఆస్తి పన్ను పరంగా కూడా మూడేళ్ల వరకు ఎలాంటి మార్పుచేర్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మార్కెట్‌ విలువలు మాత్రం రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఏదైన నిర్ణయం తీసుకుంటే సవరణ చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు.

సీసీఏలో నమోదు 
మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో త్వరలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించడం జరుగుతుంది. సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం విషయంలో స్పష్టత వచ్చింది. ఆన్‌లైన్‌లో ఈ సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం మున్సిపాలిటీలోని వార్డుల్లో జతచేస్తూ సీసీఏలో నమోదు చేయాల్సి ఉంది. సోమవారం దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. – జయవంత్‌రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్‌   

మరిన్ని వార్తలు