అభ్యర్థుల్లో టెన్‌‘సన్‌’!

6 Apr, 2019 18:22 IST|Sakshi
ప్రచారంలో తలపాగా చుట్టుకుంటున్న మాలోత్‌ కవిత, సత్యవతిరాథోడ్‌

 ఎండ వేడితో ప్రచారంలో కలిసిరాని కార్యకర్తలు

40 డిగ్రీ సెల్సియస్‌ దాటుతున్న ఉష్ణోగ్రత   

సాక్షి,నర్సంపేట: ఐదు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌.. ఈ సమయంలో అభ్యర్థులు ప్రచారంలో ఉధృతి పెంచితేనే ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే అవకాశముంటుంది.. కానీ మండుతున్న ఎండలతో ప్రచారంపై పెనుప్రభావం పడుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్న నేపథ్యంలో ప్రచారంలో కలిసొచ్చేందుకు  కార్యకర్తలు, నాయకులు జంకుతున్నారు. రాష్ట్రస్థాయి నేతలు వస్తేనే బహిరంగ సభలు తప్ప ఎండల ప్రభావంతో నేతలు సైతం ఇంటింటి ప్రచారానికి, రోడ్‌ షోలకు సాయంత్రం పూట తరలుతున్నారు. 

ఎండే కారణం..
మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 4న జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ మినహా భారీ ప్రచార సభలు, కార్యక్రమాలేవీ జరగలేదు. దీనికి ప్రధాన కారణం ఎండలేనని చెబుతున్నారు. మార్చి నుంచే ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పర్యటించలేకపోతున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచార సందడి స్తబ్దుగా కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ప్రచార రథాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇక వాతావరణం చల్లబడ్డాక సాయంత్రం వేళల్లో మాత్రమే రాజకీయ పక్షాలు కాలనీలు, గ్రామాల పర్యటనలను తిరిగి చేపడుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలంలో మహబూబాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధి బలరాంనాయక్‌ రోడ్డు షోను నిర్వహించారు. 

వ్యవసాయ పనులు మరోవైపు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకుల పర్యటనలను మిశ్రమ స్పందన లభిస్తోంది. గ్రామాల్లో వరి మార్పిడి పనులు ముమ్మరంగా సాగుతుండగా, ఎండ తీవ్రత తట్టుకోలేక పెద్ద మొత్తంలో జనం కలిసి నడిచేందుకు వెనకాడుతున్నారు. ఇటీవల పూర్తయిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్‌ ఎన్నిక ప్రచారాల్లో జన బలం అంతగా కనిపించడం లేదనే విషయాన్ని రాజకీయ వర్గాలే చెబుతున్నాయి. వ్యవసాయ పనులు, ఎండ తీవ్రత పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత
ఈనెల ప్రారంభ నుంచి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రచారానికి వెళ్లే వారికి ఎండ దెబ్బ తప్పడం లేదు. ఎన్నికల ప్రచారం ముగింపు నాటికి మరింత ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థుల్లో టెన్‌‘సన్‌’మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు నియోజకవర్గాన్ని పూర్తిగా పర్యటించలేని అభ్యర్థులు, నాయకులు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు