ప్రాణం పోతుందన్నా పట్టించుకోలేదు

18 Jul, 2020 02:29 IST|Sakshi

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి మృతి

కుటుంబీకులు వేడుకున్నా కనికరించని 108 సిబ్బంది

దుబ్బాకటౌన్‌: ‘ఊపిరి ఆడక ప్రాణం పోతోంది.. ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు త్వరగా రావాలి’అంటూ 108కు ఫోన్‌ చేసి ఎంత వేడుకున్నా రాకపోవడంతో ఓ వ్యక్తి సకాలంలో వైద్యం అందక మృత్యువాతపడ్డాడు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈ సంఘటన జరిగింది.  దుబ్బాకకు చెందిన చీర్లంచ శ్రీనివాసు(56) అనే వ్యక్తి తల్లి లక్ష్మికి ఇటీవలనే కరోనా లక్షణాలు కనబడటంతో ఆమెను సిద్దిపేట ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం రాత్రి లక్ష్మి మృతి చెందింది. అంబులెన్స్‌లో మృతదేహాన్ని దుబ్బాకకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించిన తరువాత ఆమె కరోనాతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో వైద్యులు శ్రీనివాసు కుటుంబాన్ని గురువారం హోంక్వారంటైన్‌లో ఉంచి బయటకు రావద్దని సూచించారు.

కాగా, శుక్రవారం ఉదయం శ్రీనివాసు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందంటూ కింద పడిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు ఇరుగు పొరుగు వారిని సాయం చేయాలని కోరినా ఎవరూ ముందుకు రావడానికి సాహసించలేదు. 108కు ఫోన్‌ చేస్తే ఎంతకూ స్పందించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య సిబ్బందికి సమాచారం అం దించినా వారు కూడా అక్కడికి చేరుకోవడం ఆలస్యం కావడంతో శ్రీనివాసు గంటకుపైగా శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మృతిచెందాడు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే సాయంత్రం శ్రీనివాసు అంత్యక్రియలు నిర్వహించారు. 

కుటుంబీకులకు నెగెటివ్‌: వైద్యం అందక శ్రీనివాసు మృతిచెందడం.., ఆయన తల్లి మూడు రోజుల క్రితం కరోనాతో మరణించడంతో అప్రమత్తం అయిన వైద్య సిబ్బంది, శ్రీనివాసు కుటుంబీకులు ఏడుగురిని సిద్దిపేటకు తరలించి ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. అయితే వారికి నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు