‘పసి’డి వెన్నెలకు పేద గ్రహణం

10 Nov, 2017 13:22 IST|Sakshi

ప్రేమకు తలవంచడం సరే... పేదరికానికి ఎలా తలదించాలో ఆటో డ్రైవర్‌ను హనుమంతును అడిగితే తెలుస్తుంది. కడుపు తీపికి కట్టుబడాలా.. కఠిన దారిద్య్రానికి పట్టుబడాలా.. అతని భార్య అనిత గుండెలోతుల్ని అడిగితే తెలుస్తుంది. పేదరికం ఎలా ఉంటుందో దరిద్రం చేసే దారుణ దాడిలో గుండె ఎలా బీటలు వారుతుందో.. మనుషులు ఎలా నిస్సహాయులుగా.. మారుతారో తెలుస్తుంది. అనుబంధాలు.. ఆప్యాయతలు పేదల బతుకు నిఘంటువుల్లోంచి ఎలా చెదిరిపోతున్నాయో ఆ దంపతుల బతుకును చదివితే అక్షరాలా అర్థమవుతుంది. ఆకాశాన పున్నమి వెన్నెల్లా.. ఇంటిముందు వెలిగే రెండు దీపాల్లా బోసినవ్వులతో ఈ లోకంలో అడుగుపెట్టిన ఆ కవలలకి అప్పుడే చేదు రుచి ఏంటో చూపడానికి పేదరికం సిద్ధమైంది. పాలుగారే పసికందుల్ని బతుకుపోరులో తలపడమంటూ శాసిస్తోంది.

విధిలేక.. కన్నతల్లి అనిత మనసు రాయి చేసుకుని ఒక బిడ్డను దూరం చేసుకోవడానికి సిద్ధమైంది. కడ్తాల్‌ మండలం వాసుదేవ్‌పూర్‌కు చెందిన హనుమంతు, అనిత దంపతులు ఈ నెల 6న పుట్టిన ఆడ కవల పిల్లల్ని పోషించే శక్తి లేదంటూ ఆమనగల్లు ఐసీడీఎస్‌ కార్యాలయానికి గురువారం వచ్చి ఒకబిడ్డను సీడీపీఓ సుగుణకు అప్పగించారు. చిన్నారిని అమీర్‌పేటలోని శిశుగృహకు తరలిస్తామని సీడీపీఓ చెప్పారు. చెట్టుకు కాయ భారమా.. తల్లికి పిల్ల భారమా.. అందామా..! లేదా పేదరికంతో బతుకులే భారమని నిట్టూరుద్దామా! – ఆమనగల్లు 

మరిన్ని వార్తలు