కేసీఆర్ ఏడాది పాలనలో అంతా మోసమే: మంద కృష్ణ

4 Jun, 2015 06:57 IST|Sakshi

హైదరాబాద్: ఏడాది పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని ఎస్సీలను మోసం చేశారని, కేబినెట్‌లో ఒక్క మాదిగ, మాల వర్గానికి చెందిన వారికి కూడా చోటు కల్పించలేదని విమర్శించారు. అలాగే కేబినెట్‌లో ఒక్క మహిళకూ చోటివ్వకుండా అవమానించారన్నారు. బుధవారం ఇక్కడ ఆయన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించనందుకు నిరసనగా ఈ నెల 5న చలో హైదరాబాద్ పేరిట మహిళా గర్జనను నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి ఏడాది పాలనలో గర్వించడానికి ఏమీ లేకపోగా అనేక మోసాలు, వైఫల్యాలు చోటుచేసుకున్నాయన్నారు. అమరుల త్యాగాలు, ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో రాష్ట్రం సాధించుకున్న ఆనందం అట్టడుగువర్గాల్లో ఆవిరై పోయిందని మంద కృష్ణ అన్నారు.

వచ్చే తెలంగాణ దొరల పాలు కాకూడదని 2011లోనే తాను హెచ్చరించానని, అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కేసీఆర్ హామీల భ్రమల్లో పడిపోయారన్నారు. మిషన్‌కాకతీయలో భాగంగా 46 వేల చెరువుల గురించి తెలుసుకోగలిగిన వారికి, తెలంగాణ కోసం అమరులైన 1300 మందిని గురించి గుర్తించేందుకు ఏడాది సమయం సరిపోలేదా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు