మోదీ మాస్టర్‌ మైండ్‌.. తెలంగాణలో బీజేపీ ప్లాన్‌ సక్సెస్‌!

13 Nov, 2023 13:23 IST|Sakshi

తెలంగాణ శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగానే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ సామాజికవర్గాన్ని ఉద్దేశించి విశ్వరూప సభలో చేసిన ప్రసంగం, ఆ వర్గం నేత మంద కృష్ణను పొగిడిన తీరు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొన్ని రోజుల క్రితం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ కాస్త నిస్సారంగా జరిగితే , పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభ మాంచి జోష్‌గా జరిగింది. 

తొలి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పటికీ, ఆయన చాలా డల్‌గా మాట్లాడటం, మోదీ సైతం మొక్కుబడిగా పవన్ పేరు ప్రస్తావించడం జరిగింది. అదే శనివారం జరిగిన భారీ సభలో మంద కృష్ణను ఉద్దేశించి ఆయన పలుమార్లు మాట్లాడిన విషయాలు, అన్నిటికి మించి తాను కూడా కృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని, వర్గీకరణ పోరాటానికి అండగా ఉంటానని, సమస్య పరిష్కారానికి కమిటీని నియమిస్తామని చెప్పిన తీరు మాదిగ సామాజికవర్గాన్ని ఆనందంలో ముంచెత్తిందని చెప్పాలి. వినడానికి కొంచెం అతిగా ఉన్నా, ఆయన స్పీచ్‌తో  సభికులంతా హర్షద్వానాలతో మోత మోగించారు. 

మోదీ, మంద కృష్ణ మద్య జరిగిన ఉద్వేగ భరిత సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. కృష్ణ ప్రధానిని కౌగించుకుని, కంట తడిపెట్టడం, దానికి ఆయన ఓదార్చడం తదితర సన్నివేశాలు  ఉత్కంఠభరితంగా సాగాయి. అలాగే కృష్ణ కూడా తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తుతూ ఉపన్యాసం చేశారు. మరో విశేషం ఏమిటంటే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించకపోవడం. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక కీలక ఘట్టమే అనిపిస్తుంది. ప్రత్యేకించి తెలంగాణలో మాదిగ వర్గం అత్యధికంగా ఉంటారు. మంద కృష్ణ మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలుమార్లు భారీ సభలు జరిగాయి. దాదాపు అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇచ్చినా కేంద్రంలో ఉషా మెహ్రా కమిటీ సిఫారస్ చేయకపోవడంతో అది ఆగిపోయింది.

సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం పెండింగ్‌లో ఉంది. మాల సామాజికవర్గం వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో రాజకీయ పార్టీలు కూడా గందరగోళంలో పడ్డాయి. అయితే, బీజేపీ తొలి నుంచి ఈ డిమాండ్‌కు మద్దతు ఇస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇందుకోసం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడమే కాకుండా, అధిష్టానంతో దీనిపై సంప్రదింపులు కూడా చేశారు. అయినా అది ఒక కొలిక్కి రాలేదు. విశేషం ఏమిటంటే మోదీ అధికారంలోకి వచ్చి కూడా తొమ్మిదిన్నరేళ్లు అయింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఆయన ప్రభుత్వం కూడా మరి ఎందుకు ఇన్నాళ్లు పరిష్కరించలేదన్న ప్రశ్న వస్తుంది. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే మాదిగ వర్గాన్ని ఆకట్టుకోవడానికి వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసినట్లు అర్ధం అవుతుంది. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలో దళిత ప్రముఖ నేతలు అంబేద్కర్, జగ్జీవన్‌ రామ్ వంటి వారికి కాంగ్రెస్ నుంచి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎంపిక చేసినా, తదుపరి గిరిజన నేత మర్మును ఎంపిక చేసినా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఆయన విమర్శించారు. రామ్ విలాస్ పాశ్వాన్ , బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంజీలకు బీహార్‌ సీఎం నితీష్ కుమార్ నుంచి అవమానాలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రఖ్యాత దళిత కవి గుర్రం జాషువా రాసిన గబ్బిలం కవిత్వంలోని కాశీ అంశాన్ని ప్రస్తావించి, తాను అదే కాశీ నుంచి ఎంపీ అయ్యాయని ఆయన సెంటిమెంట్ ప్రయోగించారు. 

గుర్రం జాషువా ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందినవారు. తెలంగాణలో మాదిగ వర్గానికి చెందిన మాజీ మంత్రి టి.ఎన్. సదాలక్ష్మి, టివి నారాయణల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇదంతా తెలంగాణలోని దళితులు, ముఖ్యంగా మాదిగలను తిప్పుకోవడానికి మోదీ చేసిన ప్రయత్నమే అన్న సంగతి తెలుసుకోవడం కష్టం కాదు. ఈ విషయంలో కొంతమేర  మోదీ సఫలీకృతం అయినట్లు అనుకోవచ్చు. ఎందుకంటే గత సభ కంటే భారీ ఎత్తున జనం రావడం, తమ డిమాండ్ కు అనుకూలంగా ప్రధాని ఉండటం, తమ నేత మంద కృష్ణను పదేపదే ఆయన ప్రస్తావించడంతో కేరింతలు కొట్టిన తీరు సహజంగానే బీజేపీకి కొంత ఊపు ఇస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను విమర్శించడం ఆయన మానలేదు. 

బీఆర్ఎస్ గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని విస్మరించిందని, మూడు ఎకరాల భూమి చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, దళిత బంధులో వివక్ష చూపుతున్నారని మోదీ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్ కూడా దళితులకు అన్యాయం చేసే పార్టీగా ఆయన అభివర్ణించారు. ఈసారి ఇరిగేషన్ స్కామ్ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణ  చేశారు. లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సహకరిస్తోందని, ఆప్‌ స్కామ్‌లో బీఆర్ఎస్ భాగస్వామి అయిందని ఆయన అంటూ, తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లు డ్రామా ఆడుతున్నాయని ఆయన అన్నారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం దళిత వర్గాలకు, రైతులకు చేపట్టిన వివిధ స్కీముల గురించి కూడా మోదీ వివరించారు. ఈ సంగతులు చెబుతున్నప్పుడు పెద్దగా స్పందన లేదు కానీ, వర్గీకరణ అంశాన్ని మోదీ ప్రస్తావించినప్పుడల్లా పెద్ద ఎత్తున హర్షద్వానాలు వచ్చాయి. మోదీ మొత్తం ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేశారు. వర్గీకరణ అంశం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉందని చెబుతూనే, కమిటీ ద్వారా పరిష్కారం చేసే యత్నం జరుగుతుందని, మాదిగల ఉద్యమంలో తాను కూడా ఉంటానని చెప్పడం విశేషం.

ఇక, సమస్యను పరిష్కరించవలసిన ప్రధాని తాను కూడా పోరాడతానని అనడం వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా, ఎన్నికల నేపథ్యంలో వారిని ఆకట్టుకోవడానికి ఈ డైలాగు వాడినట్లు అనిపిస్తుంది. ఈ నెలాఖరులో ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు మూడురోజులు మోదీ సభలు తెలంగాణలో పెట్టబోతున్నారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనుకున్న సమయంలో మోదీ వచ్చి దానిని పైకి లేపడానికి చేస్తున్న కృషి ఎంతవరకు సఫలం అవుతుందన్నది చూడాలి. మాదిగ వర్గం ఓట్లను ఆకర్షించడం వరకు కొంత సఫలం అయినట్లే లెక్క. కాకపోతే పూర్తి స్థాయి విజయానికి ఇది సరిపోతుందా అన్నది డౌటు!.

:కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు