మావో అగ్రనేత గణపతి ఆస్తులపై ఎన్‌ఐఏ విచారణ

17 Sep, 2014 00:34 IST|Sakshi
మావో అగ్రనేత గణపతి ఆస్తులపై ఎన్‌ఐఏ విచారణ

కరీంనగర్: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ) మంగళవారం విచారణ నిర్వహించింది. గణపతి స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం బీర్‌పూర్‌లో శిథిలమైన ఇంటిని అధికారులు పరిశీలించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి గణపతిపై బిలాస్‌పూర్ కోర్టులో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో కోర్టుకు హాజరు కావడం లేదని గత ఏప్రిల్‌లో లక్ష్మణ్‌రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. అయినా హాజరుకాకపోవడంతో బిలాస్‌పూర్ ప్రత్యేక కోర్టు తీవ్రంగా పరిగణించి లక్ష్మణ్‌రావుకు చెందిన ఆస్తుల జప్తుకోసం వివరాలు సేకరించాలని ఎన్‌ఐఏను ఆదేశించింది.

ఇందులో భాగంగా మంగళవారం ఎన్‌ఐఏ అధికారి బీర్‌పూర్‌లోని లక్ష్మణ్‌రావు ఇంటిని పరిశీలించారు. ఆయనకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే విషయంపై గ్రామంలో విచారణ జరిపారు. శిథిలమైన ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తులు లేవని గ్రామస్తులు అధికారికి తెలిపారు. అనంతరం సారంగాపూర్‌లో రెవెన్యూ అధికారులను కలిసి లక్ష్మణ్‌రావుకు చెందిన ఆస్తులపైనా ఆరా తీశారు.
 
 

మరిన్ని వార్తలు