చుక్‌బుక్‌ దందా

17 Jun, 2020 10:27 IST|Sakshi

ఆన్‌లైన్‌ బుకింగ్‌ పేరిట ఏజెంట్ల మోసాలు

‘అత్యవసర’ ప్రయాణాలే లక్ష్యంగా దోపిడీ  

నాంపల్లి, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ల వద్ద తిష్ట

నిర్ధారిత టికెట్లు ఇప్పిస్తామంటూ దళారుల దగా  

సొంతూళ్లకు వెళ్లే వలస కార్మికుల జేబులు గుల్ల

ప్రయాణికులను వదలని అక్రమార్కులు  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్టకాలంలో రైల్వే ప్రయాణికులను దళారులు దోచుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థతుల్లో సొంతూళ్లకు వెళ్లాల్సినవారిని, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకొని ఏజెంట్లు దోపిడీకి పాల్పడుతున్నారు. వలస కార్మికుల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నప్పటికీ డిమాండ్‌దృష్ట్యా చాలా మందికి అవకాశం లభించడం లేదు. దీంతో చాలామంది కార్మికులు ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లపై ఆధారపడుతున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌లపై అవగాహన ఉండటంలేదు. సికింద్రాబాద్‌  రైల్వేస్టేషన్‌కు వస్తున్న అమాయక, నిరక్షరాస్యులైన వలస కార్మికులను లక్ష్యంగా చేసుకొని  అక్రమార్జన పర్వాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రామిక్‌ రైళ్లకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యాప్రత్యేక రైళ్లలో వెళ్లేందుకు నిర్ధారిత టికెట్లు ఇస్తామంటూ కార్మికుల జేబులు  లూటీ చేస్తున్నారు. 

మోసాలు ఇలా..
దానాపూర్‌కు వెళ్లే నలుగురు ప్రయాణికుల నుంచి ఇటీవల ఒక బ్రోకర్‌  రూ.8000 వరకు వసూలు చేశాడు. ట్రైన్‌ వచ్చే తేదీనాటికి కూడా తమకు టికెట్లు  అందకపోవడంతో మోసపోయినట్లు వారు గుర్తించారు. ‘ఇద్దరు ప్రయాణికులను పంపించేందుకు ఓ మధ్యవర్తి రూ.2500 తీసుకున్నాడని, మరుసటి రోజు ట్రైన్‌ కోసం సిద్ధంగా ఉండాలని చెప్పి వెళ్లిపోయాడని సుభాష్‌ అనే మరో ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వలస కూలీలు  ఈ తరహా మోసాలకు గురవుతుండగా, ప్రత్యేక రైళ్ల కోసం ఎదురు చూసే సాధారణ ప్రయాణికులు కూడా ఏజెంట్ల చేతికి చిక్కి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోలేని నిస్సహాయతను ఏజెంట్లు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో నగరంలో చిక్కుకుపోయినవారు ప్రస్తుతం ఏదో విధంగా సొంత గ్రామాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దళారులు, ఏజెంట్లు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల చుట్టుపక్కల తిష్టవేసి ఇలాంటి ప్రయాణికులను గుర్తించి  ఆన్‌లైన్‌ బుకింగ్‌ల పేరిట అక్రమార్జనకు పాల్పడుతున్నారు.  

అన్నింటికీ ఆన్‌లైన్‌ బుకింగ్‌లే..
ప్రయాణికుల అవసరాల కోసం నాంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి ప్రతిరోజూ 9 ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటితో పాటు సికింద్రాబాద్‌– బెంగళూర్‌ డైలీ, సికింద్రాబాద్‌– న్యూఢిల్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. శ్రామిక్‌ రైళ్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మందికిపైగా వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లారు. అయినప్పటికీ వివిధ  ప్రాంతాల మధ్య నడిచే ప్రత్యేక రైళ్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. సాధారణ ప్రయాణికులతో పాటు వలస కూలీలు కూడా ప్రత్యేక రైళ్లలో బయలుదేరుతున్నారు. దీంతో సికింద్రాబాద్‌– దానాపూర్, సికింద్రాబాద్‌– హౌరా వంటి రైళ్లకు డిమాండ్‌ భారీగా ఉంది. ప్రతి రోజు సుమారు 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. మరోవైపు సాధారణ బోగీల్లో  ప్రయాణానికి కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉండటంతో చాలా మంది ప్రయాణికులు ఆధార్‌ కార్డులతో ఏజెంట్ల వద్దకు తరలి వస్తున్నారు. ప్రయాణికుల తప్పనిసరి అవసరం, అప్పటికప్పుడు బయలుదేరాల్సి రావడంతో ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు.  రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రయాణికుల వివరాల నమోదు కోసం ప్రారంభించిన ఆన్‌లైన్‌ బుకింగ్‌లు ఏజెంట్లు, దళారులకు వరంగా మారాయి.  సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌ పరిసరాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు ఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులు ఏ ఒక్కరికీ అధిక చార్జీలు చెల్లించరాదని, దళారులను ఆశ్రయించవద్దని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు