రద్దీ రైళ్లతో మెట్రో రికార్డు

7 Oct, 2019 04:16 IST|Sakshi

జనసంద్రమైన సికింద్రాబాద్,అమీర్‌పేట్, ఎల్బీనగర్‌ స్టేషన్లు

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రయాణికుల తొక్కిసలాట..

ఆదివారం 3.70 లక్షల మంది జర్నీ

సాక్షి,హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రికార్డు ప్రయాణికుల జర్నీతో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. శనివారం 3.65 లక్షలమంది మెట్రో జర్నీ చేయగా.. ఆదివారం అర్థరాత్రి వరకు సుమారు 3.70 లక్షలమంది మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో మెట్రో రద్దీ 2.75 లక్షల మేర ఉండగా, సెలవు రోజుల్లో గరిష్టంగా 3 లక్షల మేర రద్దీ ఉంటుందన్నారు. సమ్మె నేపథ్యంలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని తెలిపారు.పలు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, నగరంలోని ప్రధాన బస్‌స్టాండ్లు ఎంజీబీఎస్, జేబీఎస్‌ సహా.. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లకు సమీపంలోని మెట్రో స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌ మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు వేలాదిమంది ప్రయాణికులు ఒక్కసారిగా లోనికి చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి స్వల్పంగా లాఠీఛార్జ్‌ చేశారు.

ఆరు అదనపు మెట్రో రైళ్లు 
ఆదివారం ఉదయం 6 గం. నుంచి మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రోజువారీగా నడిచే రైళ్లకు అదనంగా ఆరు ప్రత్యేక రైళ్లతోపాటు..మొత్తంగా వంద ట్రిప్పులను అదనంగా నడిపినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు